
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం అందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్‌కు 63 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు కేవలం 25 ఓట్లు వచ్చాయి. దీంతో, ఎంఐఎం అభ్యర్థి 38 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలుపొందారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకున్న 25 ఓట్లు మాత్రమే పొందిన బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఇక, ఎంఐఎంకి చెందిన 49, కాంగ్రెస్‌కి చెందిన 14 ఓట్లు కలిపి 63 ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ ఓటు వేయలేదు. దీంతో, ఓటమి ఎదురైంది.

ఇక, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 112 ఓట్లకు గాను పోలైన 88 ఓట్లు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ మాత్రం క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకునప్పటికీ అలాంటి ఏమీ జరగకపోవడంతో ఓటమిని చవిచూసింది.

మరోవైపు, ఎన్నికల ఫలితాలపై బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్‌ను ఎలక్షన్ కమిషన్ ఎందుకు రద్దు చేయవద్దు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఓట్లు వేయవద్దని అని చెప్తారు.. మరి మీరు ఏ విధంగా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పని చేస్తుంది. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక్కటే అనేది అర్థమవుతుంది. హైదరాబాద్, తెలంగాణ ప్రజలు ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి.
ఎన్నికల్లో సహకరించిన బీజేపీ నాయకత్వానికి, అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. వారు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఓటింగ్‌కు రానివ్వకుండా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సంఖ్య పరంగా మేము ఓడినా.. నైతికంగా నేను గెలిచాను. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తొత్తులుగా మారాయి. ఎంఐఎంకు కాంగ్రెస్ డైరెక్ట్‌గా మద్దతు ఇస్తే.. బీఆర్‌ఎస్ ఓటింగ్‌కు రాకుండా దోహదపడింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా.. కౌంటింగ్ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఆఫీసు వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలు జీహెచ్‌ఎంసీ వద్ద మోహరించాయి.