
సాక్షి, ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్నారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్‌ను మన్మోహన్ సింగ్ ముగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌పై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపించాయి.
ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ సింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ మధ్యతరగతి, ఆకాంక్ష యువతకు హీరో, పారిశ్రామికవేత్తలకు నాయకుడు మార్గదర్శకుడు అని కొనియాడారు. మన్మోహన్ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుండి బయటపడగలిగిన పేదలందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకొచ్చారు.
ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు.
మన్మోహన్ రాజకీయ ప్రస్థానం..
ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్‌లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఏప్రిల్ 3న బుధవారం 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు.