
సన్నిహితుడైన బీద రవిచంద్రకి మరోసారి అవకాశం
రాజ్యసభ విషయంలోనూ సానా సతీష్‌కు ఛాన్స్
నామినేటెడ్ పదవుల్లోనూ ఆయన చెప్పిందే వేదం
గొల్లుమంటున్న సీనియర్లు..
సాక్షి, అమరావతి: టీడీపీలో పదవులు ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu) ఇష్ట ప్రకారం లభించేవి. రకరకాల సమీకరణలు, ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యవహారాలను బట్టి పదవులను కట్టబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు లోకేశ్ (Lokesh) ఆశీస్సులు ఉంటేనే పదవులు వస్తాయని టీడీపీలో కింది స్థాయి కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఆయన ఆశీస్సులు ఉండాలంటే ఆర్థికంగా బలవంతులై ఉండాలనే సూత్రం చాలాకాలం నుంచి అమలవుతోంది. గత ఎన్నికల్లో సీట్లు డబ్బు మూటలిచ్చిన వాళ్లకే ఇచ్చారని ఆ పార్టీలోనే బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులకూ అదే సూత్రాన్ని పాటించినట్లు పార్టీ సీనియర్ నేతలు వాపోయారు.
ఆయన కోటరీకే ఎమ్మెల్సీ పదవులు
ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. టీడీపీకి మూడు పదవులు దక్కితే మూడు లోకేశ్‌కి అత్యంత విధేయులుగా ఉన్న వారికే లభించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతోపాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. బీటీ నాయుడు (BT Naidu) కూడా లోకేశ్‌కు దగ్గరి వ్యక్తి కావడంతోపాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడే.
కావలి గ్రీష్మ (Kavali Greeshma) లోకేశ్ కోటరీకి చెందిన నేతే. మహానాడులో బూతులు తిడుతూ తొడ కొట్టిన నాయకురాలు కావడంతో ఆమెకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. ఉత్తరాంధ్రలో అనేక మంది సీనియర్ నేతలు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నేతలుంటే అంత చురుగ్గా పని చేయని గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కడానికి చినబాబు ఆశీస్సులు ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
రాజ్యసభ స్థానాల్లోనూ అంతే
మూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు దక్కగా ఆ రెండింటినీ ధన బలం ఉన్నా సానా సతీష్‌బాబు, బీద మస్తాన్‌రావుకి ఇచ్చారు. సానా సతీష్‌బాబు.. లోకేశ్ కోటరీలో ప్రస్తుతం అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చారు. బీద మస్తాన్‌రావు కూడా డబ్బు మూటలతో వచ్చిన వ్యక్తేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు.
చదవండి: యనమలకు బాబు 'షాక్' హ్యాండ్
చినబాబు ఆశీస్సులు ఉంటే.. చింత అక్కర్లేదు..
మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేశ్ చెప్పిన వారికే పదవులు వచ్చాయి. కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ఇతర పదవులను ఆయన ఇచ్చిన జాబితా ప్రకారమే కేటాయించారు. పదవుల కోసం ఎవరైనా చంద్రబాబు వద్దకు వెళితే ఆయన తన కొడుకును కలవమని చాలామంది నేతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీనియర్లు చంద్రబాబు మారిపోయాడని, ఆయన కొడుకును కలవాల్సిన అవసరం ఏమిటని భావించి వెళ్లలేదు. కొందరు వెళ్లి కలిసినా, ప్రయోజనం లేదని చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిణామాలు పార్టీలో సీనియర్లకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం.