
సాక్షి, అమరావతి : గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, ఆయన కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు బీజేపీపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. అందుకే ఏపీలో బీజేపీ ఎదగడం లేదంటూ తెగ ఫీలవుతూ విశ్లేషణలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ బీజేపీపై ప్రేమతో కాదని, పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబును, టీడీపీని రక్షించే ప్రయత్నమని చిన్న పిల్లలకూ ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాధాకృష్ణకు ఓ బహిరంగ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. లేఖలో ఇంకా ఏం పేర్కొన్నారంటే..
► ఆంధ్రజ్యోతి సంపాదకీయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావునుద్దేశించి మీరు రాసిన విశ్లేషణలో చంద్రబాబును జీవీఎల్ విమర్శించడం మా పార్టీకే మంచిది కాదని తెలిపారు.
ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయకత్వమే కట్టడి చేయాలని సెలవిచ్చారు.
► మీరు టీడీపీకి సలహాదారుడిగా, అనుకూలంగా పనిచేస్తారని ప్రజల్లో వినికిడి. మరి ఇంత బహిరంగంగా, నిర్లజ్జగా పత్రికను అడ్డంపెట్టుకుని మా పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేంటి?
► మీ రాజకీయ సలహాలు చంద్రబాబుకే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకు పరిమితమవడంలో మీ పాత్ర ప్రధానమా కాదా? అదే నిజమైతే, మీరు ఇలాగే టీడీపీకి సలహాలిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుంచి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం.
► మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో మా పార్టీ జాతీయ నాయకత్వానికి మీరు సెలవిచ్చారు. ఈ విశ్లేషణలో అసలు మతలబేంటో త్వరలోనే వారికి వివరిస్తాను.