
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య అప్పుడే సవాళ్ల పర్వం మొదలైంది. యువనేతలు ఉదయనిధి స్టాలిన్, అన్నామలై (annamalai) పరస్పరం సవాళ్లు విసురుకోవడం తమిళ రాజకీయాల్లో (Tamil Politics) హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపిస్తూ అన్నామలై చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి కౌంటర్ ఇచ్చారు. తన ఇంటిని ముట్టడిస్తామన్న అన్నామలైకు ఉదయనిధి బహిరంగ సవాల్ విసిరారు. ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టు అన్నామలై ప్రకటించారు.
చైన్నెలోని షెనాయ్‌నగర్‌లో గురువారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డీఎంకే యువనేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ (udhayanidhi stalin) పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తున్న తమ ప్రభుత్వంపై కొంతమంది అనవసరంగా విమర్శలు చేస్తున్నారని.. అందరికీ అన్ని లక్ష్యంగా సాగుతున్న సీఎం స్టాలిన్‌పై (CM Stalin) నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడులో విద్య, ఉపాధికి అడ్డంకులు సృష్టించే విధంగా కేంద్రం సైతం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీబీఎస్‌ఈ విద్యా సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
తన ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించిన అన్నామలైకు ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే అన్నాసాలైలోకి అడుగు పెట్టమనండి అంటూ వ్యాఖ్యానించారు. ‘తొలుత అన్నా అరివాలయం అన్నారు. ఇప్పుడు మా ఇల్లు ముట్టడిస్తామంటున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఎక్కడికీ వెళ్లను, ఇంట్లోనే ఉంటా.. ధైర్యం ఉంటే రమ్మనండి’ అంటూ ఓపెన్ చాలెంజ్ చేశారు.
అన్నాసాలైలో ఎక్కడికి రావాలి?
ఉదయనిధి స్టాలిన్ సవాల్‌కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. సేలంలో బీజేపీ నాయకుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు గురువారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఉదయనిధి స్టాలిన్ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ‘ధైర్యం ఉంటే అన్నాసాలైకు రావాలని ఉదయనిధి అన్నారు. నేను సిద్ధంగా ఉన్నాను. చైన్నెలోని అన్నాసాలైలో ఎక్కడికి రావాలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పమనండి. స్థలం, రోజు, సమయం చెబితే అక్కడికి ఒంటరి వెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.
క్షీణించిన శాంతిభద్రతలు
కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరిగాయని అన్నామలై ఆరోపించారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సర్క్యులర్ ద్వారా వెల్లడించారని తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ముఖ్యమంత్రి స్టాలిన్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అసత్యాలు కట్టిపెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ బీజేపీ, డీఎంకే పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ‘గెట్ అవుట్ మోదీ’ అంటూ డీఎంకే ప్రచారం మొదలెట్టగా, ‘గెట్ అవుట్ స్టాలిన్’ అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
చదవండి: మన ట్వీట్లలో ఎవరు గెలిచారో చూద్దామా?