
భువనేశ్వర్: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.
పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్ భావోద్వేగానికి గురయ్యారు.