
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? అంటూ కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కార్ అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.
మాజీ మంత్రి బుగ్గన తాజాగా హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘మా పరిపానలో సామాన్య మానవుడి శ్రేయస్సు గురించి ఆలోచించాం. సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసాకు నిధులేవి?. సున్నా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, మత్సకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు?. విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడం లేదు. ఏపీఎండీసీకి రూ.9 వేల కోట్లు ఎందుకు కేటాయించారు?
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాకుండా నీతులు చెబుతున్నారా?. ఇప్పుడు సంపద సృష్టి ఏమైంది? అప్పు పరిస్థితి ఏంటి?. వైఎస్సార్‌సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా అప్పు చేసింది. ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించకపోవడంతో ప్రజా ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. బాబు ష్యూరిటీ-బాబు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నించారు.
