3 నిమిషాల్లో! | - | Sakshi
Sakshi News home page

3 నిమిషాల్లో!

Published Wed, Apr 23 2025 7:50 PM | Last Updated on Thu, Apr 24 2025 10:46 AM

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార పార్టీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి (49) దారుణ హత్య ఒంగోలు నగరంలో సంచలనాన్ని రేకెత్తించింది. నగర ప్రజలు కలవరపాటుకు గురయ్యారు. పక్కా ప్రణాళికతో బైకులపై వచ్చిన నలుగురు యువకులు కేవలం మూడు నిమిషాల్లోనే హత్య చేసి పరారయ్యారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరగడంతో పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న నగరంలో టీడీపీ నాయకుడి దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. ఎస్పీ దామోదర్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

పక్కా ప్రణాళికతో..

పక్కా ప్రణాళికతో నలుగురు యువకులు రాత్రి 7.33 నిమిషాలకు వీరయ్య చౌదరి కార్యాలయంలోకి ప్రవేశించి కేవలం మూడు నిమిషాల్లో 25 చోట్ల కొడవళ్లతో దాడి చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌ వెళ్లిన ఆయన మంగళవారం ఉదయమే తిరిగి వచ్చినట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకు వీరయ్య చాలా బిజీగా గడిపారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత అక్కడ నుంచి నేరుగా వెళ్లి బైపాస్‌ మీద బండికి పెట్రోలు కొట్టించుకొని ఆఫీసుకు వెళ్లినట్లు తెలిసింది. సాయంత్రం 6.30 తరువాత ఆయన మంగమూరు రోడ్డులోని కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే హంతకులు అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. వీరయ్య చౌదరి కార్యాలయంలోకి వెళ్లిన కాసేపటి తరువాత సరిగ్గా గం.7.33 కు హంతకులు లోపలకు వెళ్లారు. లోపల ఉన్న ముగ్గురు కార్యాలయ సిబ్బందిని కత్తులు చూపి బెదిరించి పక్కనే ఉన్న గదిలోకి నెట్టివేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తలుపులు తీయడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని వారిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ లోపు కార్యాలయంలో ఏదో గొడవ జరుగుతున్నట్లు భావించిన వీరయ్య బయటకు రాగానే హంతకులు వేటకొడవళ్లతో దాడి చేసినట్లు సమాచారం. మొదట గొంతు మీద పొడిచినట్లు చెబుతున్నారు. గొంతు నుంచి గుండెల వరకు 15 పోట్లు పొడిచారని, తరువాత పొత్తి కడుపులోకి మరో 10 పోట్లు పొడిచిన తర్వాత వీరయ్య చనిపోయాడని నిర్ధారించుకున్నాకే హంతకులు అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. చేయి తిరిగిన హంతకులే ఈ హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హంతకులు 25 సంవత్సరాల వయసు లోపు వారేనని, వచ్చిన వారు స్పష్టంగా తెలుగులోనే మాట్లాడారని విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం ఒకసారి హంతకులు ఆఫీసుకు వచ్చి రెక్కీ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది.

హత్యకు కారణమేమిటి...?

వీరయ్య చౌదరి హత్యకు కారణమేమిటన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆయనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలో మద్యం వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. సిండికేట్లతో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారని, కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఆయనకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల బెంగళూరులో కొన్న ఒక భూమి వివాదం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో హత్య జరిగిందని ప్రచారం ఉంది. అలాగే రామాయపట్నం పోర్టుకు సమీపంలో వివాదాస్పద భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, అది కూడా కారణం కావచ్చన్న ప్రచారం సాగుతోంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కొంతమందితో ఈయనకు వివాదాలు ఉన్నట్టు తెలిసింది. మొత్తం వీరయ్య చౌదరి హత్యకు కారణాలు స్పష్టంగా తెలియడం లేదు.

12 బృందాలతో ముమ్మర గాలింపు...

వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. సాయంత్రం గం.7.33 సమయంలో బైకుల మీద వచ్చిన నలుగురు యువకులు లోపలకు వెళ్లి వీరయ్య చౌదరిని హత్య చేసి గం.7.36 కల్లా బైకుల మీద పరారయ్యారని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 40 మందితో 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ను రంగంలోకి దించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అన్నీ కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. ఎప్పటికప్పుడు దర్యాప్తు ప్రగతిపై సమీక్షిస్తామని, వీలైనంత త్వరగా కేసునే ఛేదించడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఉలిక్కిపడిన ఒంగోలు...

దశాబ్దాల కాలంలో ఇలాంటి హత్య జరగడం ఇదే తొలిసారి కావడంతో ఒంగోలు ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా ఒక అధికార పార్టీ నాయకుడు హత్యకు గురి కావడం, ఎస్పీ ఆఫీసుకు కూత వేటు దూరంలో హత్య జరగడం చర్చనీయాంశమైంది. నలుగురు హంతకులు నగరంలోకి ప్రవేశించి పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేయడంపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీరయ్య చౌదరి హత్య వార్త తెలిసిన వెంటనే పార్టీ అభిమానులు, ఆయన అనుచరులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జీజీహెచ్‌ వద్దకు చేరుకున్నారు. దాంతో స్పెషల్‌ పార్టీ పోలీసులను రంగంలోకి దించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఈ హత్య నేపథ్యంలో నేడు హోంమంత్రి అనిత జిల్లాకు వస్తున్నట్లు సమాచారం.

ఈదర హరిబాబుకు గుండెపోటు...

హత్యకు గురైన వీరయ్య చౌదరి మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఆయన హత్య వార్త తెలిసిన వెంటనే హరిబాబు జీజీహెచ్‌ వద్దకు వచ్చారు. కాసేపటికే ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు సమాచారం.

పంచాయతీ వార్డు సభ్యునిగా..

నాగులుప్పలపాడు: ఒంగోలులో దారుణ హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు స్వయానా మేనల్లుడు కావడంతో తొలుత అమ్మనబ్రోలు గ్రామంలో నాయకుడిగా ఎదగగలిగారు. ఈ క్రమంలో 2013–18 కాలంలో అమ్మనబ్రోలు గ్రామ పంచారయతీలో వార్డు సభ్యునిగా గెలిచి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2014 లో జరిగిన మండల పరిషత్‌ ఎన్నికల్లో చవటపాలెం గ్రామ ఎంపీటీసీగా గెలిచి నాగులుప్పలపాడు మండల పరిషత్‌ అధ్యక్షుడిగా పూర్తి కాలం పనిచేశారు. ఈ క్రమంలో టీడీపీలో ఉన్న పరిచయాలతో ప్రస్తుతం బాపట్ల పార్లమెంట్‌ టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య ముప్పవరపు సుచరిత, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరయ్య చౌదరి భార్య సుచరిత కూడా చవటపాలెం ఎంపీటీసీగా పనిచేస్తుండగా, కుమారుడు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశాడు.

పక్కా ప్రణాళికతోనే దారుణ హత్య మొదట గొంతుపై పొడిచి ఆ తరువాత 25 పోట్లు పొడిచి హత్య చేసినట్లు సమాచారం సుపారీ హత్యగా ప్రచారం హత్యతో ఉలిక్కిపడిన ఒంగోలు నగరం 12 బృందాలతో ప్రత్యేక గాలింపు పోలీసు అదుపులో ముగ్గురు? ప్రత్యేకంగా పర్యవేక్షించిన ఎస్పీ దామోదర్‌ మేనల్లుడి హత్యతో మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు గుండెపోటు

ఒంగోలు జీజీహెచ్‌ దగ్గర గుమిగూడిన వీరయ్య చౌదరి బంధుమిత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement