
ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్‌గా భార్గవి
టంగుటూరు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో జిల్లా ప్రథమ స్థానం సాధించింది. భార్గవిని విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, డిప్యూటీ డీఈఓ చంద్రమౌలేశ్వర్, ఎంఈఓ–2 తన్నీరు బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి గొప్ప ఫలితం సాధించడానికి సమష్టికృషి చేసిన ప్రధానోపాధ్యాయులు వాకా వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులను వారు ప్రత్యేకంగా అభినందించారు. 43 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 39 మంది ఉత్తీర్ణత సాధించారు. 36 మంది ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఝాన్సీ రాణి విద్యా కమిటీ చైర్మన్ పున్నయ్య చౌదరి, ఉపాధ్యాయులు శ్రీధర్ బాబు, సురేష్,వెంకటరావు, సుబ్బారావు, చెన్నయ్య భూషణ్ రెడ్డి,సుభాషిని, విజయలక్ష్మి,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
కష్టపడుతూ..చదివిస్తూ..
పుట్ట వెంకట భార్గవి తల్లిదండ్రులు రామ్మోహన్‌రావు పెట్రోల్ బంక్ లో పంపు బాయ్ గా పని చేస్తుండగా, తల్లి టైలరింగ్ చేస్తూ చదివిస్తూ వచ్చింది. చదువులో ముందంజలో ఉన్న భార్గవిని పాలకూరపాడు ప్రభుత్వ పాఠశాలలో చదువు చక్కగా చెబుతున్నారని ఉద్దేశంతో టంగుటూరు నుంచి ఆలకూరపాడుకు మార్చారు. తల్లిదండ్రుల కష్టాన్ని గమనించిన భార్గవి ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి జిల్లా ప్రథమ స్థానాన్ని సాధించింది. ట్రిపుల్ ఐటీ సీటు వస్తే మంచి ఇంజినీర్ అవుతానని భార్గవి చెబుతోంది. జిల్లా ప్రథమ స్థానం రావడం ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.