
బియ్యం లావాదేవీలా.. భూ వివాదాలా..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, బాపట్ల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సంఘటన జరిగి 24 గంటలు పూర్తి కావస్తున్నా ఇంత వరకూ సరైన క్లూ లభించలేదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం రాత్రి వీరయ్య చౌదరి హత్య జరిగిన తరువాత రాత్రికి రాత్రే హోం మంత్రి అనిత ఒంగోలుకు వచ్చారు. జీజీహెచ్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అంతకు ముందే మంత్రులు బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి జీజీహెచ్‌కు చేరుకుని మృతదేహాన్ని సందర్శించారు. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమ్మనబ్రోలులో జరిగిన వీరయ్య చౌదరి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ హత్యను అధికార పార్టీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. అనుమానితులను పోలీసు స్టేషన్‌కు తరలించి అన్నీ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బియ్యం వివాదాల కోణంలో గుంటూరు జిల్లా నిడుబ్రోలుకు చెందిన గోపి, అమీర్, అశోక్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే బాపట్ల జిల్లా వెదుళ్లపల్లికి చెందిన రైసుమిల్లు యజమానిని, నాగులుప్పలపాడుకు చెందిన ఒక వ్యాపారిని విచారిస్తున్నట్టు తెలిసింది.
భూ వివాదాలే హత్యకు దారి తీశాయా...
వీరయ్య చౌదరికి అనేక భూ వివాదాలతో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంత కాలంగా పొరుగు రాష్ట్రమైన బెంగళూరు, తెలంగాణాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా ఆయనకు భూ వివాదాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే వైజాగ్, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా జిల్లా దోర్నాల వద్ద కూడా భూ వివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రామాయపట్నం, గుడ్లూరు మండలంలోని భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో వివాదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. ఈ వివాదం ఏమైనా కారణమా అన్న కోణంలో ప్రత్యేక పోలీసులు బృందాలు ఆరా తీస్తున్నాయి. రెవెన్యూ అధికారులు అందరితో వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన వ్యక్తిపై సైతం నిఘా ఉంచినట్టు తెలిసింది.
లిక్కర్ సిండికేట్‌తో వివాదాలు...
తొలి నుంచి వీరయ్య చౌదరి మద్యం వ్యాపారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఆయనకు మద్యం వ్యాపారాలు ఉన్నాయి. మద్యం సిండికేట్లతో కూడా ఆయనకు వివాదాలు ఉన్నట్లు ప్రచారం. ఈ విషయంలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రి వద్ద రాజీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ లిక్కర్ వివాదాలు ఆయనను వెన్నాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో మద్యం సిండికేట్ల పాత్ర మీదా విచారణ జరుపుతున్నారు.
రెక్కీ చేసిన తరువాతే హత్య జరిగిందా..
వీరయ్య చౌదరి హత్యకు ముందు నిందితులు నగరంలోని ఒక హోటల్లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసినట్లు ప్రచారం జరుగుతోంది. పది రోజుల పాటు నగరంలో ఉన్న నిందితులు వీరయ్య చౌదరికి సంబంధించిన అన్నీ విషయాలను సేకరించినట్లు తెలిసింది. ఆయన రోజువారి కార్యకలాపాలు, ఒంటరిగా ఉండే సమయం లాంటి వివరాలను సేకరించినట్లు చెప్పుకుంటున్నారు. హత్యకు ముందు మూడు రోజుల పాటు ఆయన కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. హత్య జరిగిన రోజు కూడా నిందితులు వీరయ్య చౌదరిని అనుసరించినట్లు చెప్పుకుంటున్నారు. నాగులుప్పలపాడు పార్టీ నియామకాలకు సంబంధించి సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ను వీరయ్య చౌదరి కలిసి చర్చించినట్టు సమాచారం. ఆపై 5 గంటల తరువాత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను పసిగట్టిన తరువాత వీరయ్య ఒంటరిగా ఉండే సమయాన్ని ఎంచుకొని హత్యకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. హత్య చేసిన తరువాత నిందితులు ఒక స్కూటీ, మోటారు బైకు మీద తప్పించుకొని పరారయ్యారని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు నిందితులు వచ్చారని, ఇద్దరు కింద కాపలా ఉండగా నలుగురు పై అంతస్తులోకి వెళ్లి హత్యకు పాల్పడ్డారని విశ్వసనీయ సమాచారం.
నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు...
వీరయ్య చౌదరి హత్యను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం 12 బృందాలను, 40 మంది పోలీసులను రంగంలోకి దించారు. నగరాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. నగరంలోని లాడ్జీలను తనిఖీలు చేస్తున్నారు. నాలుగు రోజులుగా లాడ్జిలకు వచ్చిన వారి వివరాలు, ఎంత మంది వచ్చారు. ఎన్ని రోజులు ఉన్నారు అనే విషయాలను సేకరిస్తున్నారు. వారి ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. లాడ్జిలతో పాటుగా నగరంలోని శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఒకటే మాట...
వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత మీడియా ముందు ఒకే రీతిగా స్పందించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. జరిగిన విషయంపై వ్యాపార లావాదేవీలు, మద్యం సిండికేట్లతో ఉన్న వివాదాల గురించి సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పారు. నేరుగా వారే ఈ కేసును పర్యవేక్షిస్తుండడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు భూముల వివాదమే వీరయ్య చౌదరి హత్యకు పురికొల్పినట్లు ప్రచారం పక్కాగా రెక్కీ నిర్వహించి హతమార్చినట్టు సమాచారం నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు లాడ్జీలు, కాలనీల్లో విస్తృతంగా తనిఖీలు అన్నీ కోణాల్లో సమగ్ర దర్యాప్తు రాత్రికి రాత్రి నగరానికి వచ్చిన హోం మంత్రి అనిత అమ్మనబ్రోలులో అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అధికార తెలుగుదేశం పార్టీలో అలజడి సృష్టించింది. సంచలనం రేకెత్తించిన ఈ హత్య కేసుకు సంబంధించి జిల్లాలో రకరకాల కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. ప్రధానంగా భూ, లిక్కర్, పీడీఎస్ రైస్ వివాదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.