
జామాయిల్ తోట దగ్ధం
● రూ.4 లక్షల ఆస్తినష్టం
ముండ్లమూరు (కురిచేడు): ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో జామాయిల్ తోట దగ్ధమై సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం సంభవించింది. తోట యజమాని అనుపర్తి జాన్‌ప్రభాకర్ కథనం మేరకు.. రెండు ఎకరాల్లో జాన్‌ప్రభాకర్ జామాయిల్ తోట సాగు చేశాడు. శుక్రవారం రాత్రి అగ్నికి తోట ఆహుతైంది. చేతికందే సమయంలో జామాయిల్ తోట అగ్నిప్రమాదానికి గురికావడంతో సుమారు రూ.4 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా.. లేక బీడీ, సిగరెట్ తాగి పడేస్తే గాలికి అగ్గి రాజుకుని ప్రమాదం జరిగిందా..? అనే విషయం తెలియడం లేదన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
కురిచేడు: స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సంధ్య వాటర్ సర్వీసింగ్ పాయింట్‌ను కూల్చివేసి దాని యజమాని కే మరియబాబును దుర్భాషలాడిన ఘటనపై కురిచేడు పోలీసుస్టేషనులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.శివ శనివారం తెలిపారు. మరియబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెదకోటిరెడ్డి, పత్తి శ్రీరంగ, అతని తమ్ముడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
పర్యాటకులపై ఉగ్రదాడి సిగ్గుచేటు
మార్కాపురం: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం అమానుషమని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ రమణ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ శనివారం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పైశాచిక ఆనంద పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐజేయూ మాజీ సభ్యుడు కేవీ సత్యనారాయణ, జీఎల్ నరసింహారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు డీ మోహన్‌రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అసోిసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే బాజీవలి, యూనియన్ జిల్లా కోశాధికారి డీ బాబి, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.