Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jaganmohan Reddy comments with Regional Coordinators1
ఈసారి అధికారం మనదే: వైఎస్‌ జగన్‌

రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. వారానికి మూడు రోజులు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా పని చేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. ప్రతి పథకం కనపడకుండా పోతోంది. మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతిని ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ.. ఈ ప్రభుత్వంలో మాత్రం రూపాయికే ఎకరం చొప్పున లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఈ స్థాయిలో ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. -వైఎస్‌ జగన్‌ సాక్షి, అమరావతి: మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీల­కులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘మనల్ని అభి­మానించే వారిని కొడుతున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా.. వీళ్లకు దెబ్బలు తగులుతు­న్నాయన్నది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే జగన్‌ 2.0లో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా. మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్‌ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన అగ్రహం ఉందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు. వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అనైతిక పనులు చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్‌ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్‌సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు వచ్చాయి. కానీ అప్పటి వైఎస్సార్‌సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, కక్ష రాజకీ­యాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామ స్థాయిలో కేడర్‌ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబు­నాయుడు 12 నెలల రెడ్‌ బుక్‌ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.అవినీతి కంటికి కన్పిస్తోంది రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)తో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్‌ విద్యుత్‌ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్‌–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్‌ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.చరిత్ర పునరావృతం ఖాయం 2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ మోసమైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపో­యారు. ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తారు. ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేశాకే మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద 11 నెలలుగా మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్‌ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్‌ కమిటీల వరకు అన్నీ పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. వాళ్లకు సరైన సపోర్ట్‌ మెకానిజమ్‌గా రీజినల్‌ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్‌ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో సమన్వయం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్‌ కో–ఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్‌ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో భావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడేలా పని చేస్తారు. వీళ్లను ఆయా రీజినల్‌ కో ఆర్డినేటర్లతో మ్యాపింగ్‌ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్‌ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువగా.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేలా మోటివేట్‌ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే. నియోజకవర్గ అభ్యర్థికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్‌ కోఆర్డినేటర్లకు కాళ్లూ, చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.గెలుపే మీ పనితీరుకు గీటురాయి మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంత మందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మంచి పదవులు వస్తాయి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. అలాగే రీజినల్‌ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంత మందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనే వాళ్లకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్‌ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి, ప్రతి ఇంటికీ పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.మీరు పని చేయండి.. మీ బాధ్యత నాది మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో మన పార్టీ బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్‌గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూత్‌ కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. మోసం మనకు చేతకాదుమనం అధికారంలోకి వచ్చే నాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్‌ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయ పడ్డాం. ప్రజల కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత మన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. తొలి ప్రాధాన్యత వారికే. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా సరే నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. త్వరితగతిన కమిటీల నిర్మాణంబూత్‌ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్‌ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే ఆఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు.. గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామ స్థాయి విలేజ్‌ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్‌ ప్రెసిడెంట్‌ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్‌ ఉన్నా కూడా డివిజన్‌ ప్రెసిడెంట్‌ను నియమించాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నాటికి బూత్‌ కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది క్రియాశీలక (యాక్టివ్‌) సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్‌ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం. అక్టోబర్‌ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్థాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీల హెడ్‌లను నియమించాం. మండల స్థాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియామకాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీ నిర్వహిద్దాం.మన హయాంలో రైతులకు భరోసా⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టే వాళ్లం. మద్దతు ధర కోసం రూ.7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ⇒ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. ఆయిల్‌పామ్‌ రైతులనూ ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్‌ చార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. ⇒ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్‌ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్‌ పెట్టనిది కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకున్నాం. ⇒ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజలకు సమస్యలొస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలి’.

USA Donlad Trump Reaction On Operation Sindoor2
భారత్‌-పాక్‌ యుద్ధం.. బిగ్‌ ట్విస్ట్‌ ఇస్తూ ట్రంప్‌ వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాకిస్తాన్‌ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్‌ వెల్లడించారు.ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యం భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్‌, పాక్‌లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం మరోసారి స్పందించారు.ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్‌, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.U.S. President Donald Trump has condemned India's attack, calling it shamefulPakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025 చైనాకు భారత్ వార్నింగ్మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది.

Pak PM Shehbaz Sharif Address to nation Over Operation Sindoor3
ఆపరేషన్‌ సిందూర్‌.. తొలిసారి స్పందించిన పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉ‍గ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇక, ఆపరేషన్‌ సిందూర్‌పై పాకిస్తాన్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)పై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తొలిసారి స్పందించారు. పాకిస్తాన్‌ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్‌..తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్‌ ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాక్‌ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్‌) అనుకుంటోంది. కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేశాయి. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్‌ కుటుంబసభ్యులే ఉన్నారు. మసూద్‌ అజార్‌ సోదరి - ఆమె భర్త, మసూద్‌ మేనల్లుడు - అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్‌ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.Shehbaz Sharif says Pakistan will Retaliate & Avenge the blood🤣~ He is stammering. Unable to read the script given by Pakistan Army. Multiple CUTS just in 30 seconds. This is not Shehbaz. This is Asif Munir. This is Pakistan Army. P*gets have gone mad. pic.twitter.com/WbwQz83KPw— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 7, 2025మరోవైపు, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్‌ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్‌, పంజాబ్‌లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది.

Air India Air India Express Offer Free Ticket Rescheduling For Armed Forces4
ఆర్మీ సిబ్బందికి ఎయిర్‌ ఇండియా తోడ్పాటు

పాకిస్తాన్‌తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రయాణాల కోసం తమ వద్ద టికెట్లు బుకింగ్ చేసుకున్న ఆర్మీ సిబ్బంది టికెట్లను రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూల్ లేదా పూర్తి రీఫండ్స్ అందించనున్నట్లు ప్రకటించాయి.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్‌ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న బలగాలను వెంటనే విధులకు రప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), ఐటీబీపీ (ITBP) సహా అన్ని పారామిలిటరీ బలగాలు తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సిబ్బంది ఇప్పటికే బుక్‌ చేసుకున్న విమాన టికెట్లను ఎటువంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునేందుకు, రీ షెడ్యూల్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది."ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలలో డిఫెన్స్‌ కోటా కింద 2025 మే 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న సిబ్బందికి తమ డ్యూటీ కమిట్మెంట్లకు మద్దతుగా 2025 జూన్ 30 వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడంపై పూర్తి రీఫండ్, వన్ టైమ్ మినహాయింపును అందిస్తున్నాం" అని ఎయిరిండియా ఒక పోస్ట్‌లో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేసింది.

Operation Sindoor: India struck multiple targets in Pakistan and pok5
Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'

అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్‌ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్‌’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్‌ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజర్‌ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్‌ నిర్వహించాయి. ఎయిర్‌ టు ఎయిర్‌ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్‌ క్రూయిజ్‌ క్షిపణులు, హామర్‌ ప్రెసిషన్‌ బాంబులు, గైడెడ్‌ బాంబ్‌ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా నాలుగు స్వయానా పాక్‌ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్‌ దాడుల మాదిరిగా పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్‌ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి. అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్‌ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది. ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్‌ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్‌’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్‌ అజర్‌ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్‌ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్‌ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు. భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్‌ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్‌ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్‌ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.అద్భుత నైపుణ్యం దాడులపై నిపుణులు సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్‌ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్‌ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది. 25 నిమిషాలు.. 9 లక్ష్యాలుదాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్‌ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

CM Revanth says Holidays cancelled for emergency services employees6
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్‌ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రజల కోసం 24/7 టోల్‌ ఫ్రీ నంబర్‌ ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్‌ క్రాస్‌తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్‌ న్యూస్‌ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్‌ న్యూస్‌ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి. కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్‌ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి హైదరాబాద్‌లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్‌ డ్రిల్‌ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..? ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్‌రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్‌ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.సైన్యానికి సెల్యూట్‌: సీఎం రేవంత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్‌..’అని సీఎం తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్టు చేశారు. నేడు సంఘీభావ ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.

Reita Faria: Winner of Miss World in 1966 First Indian first Asian7
Reita Faria: తొలి అందాల డాక్టర్‌ రీటా ఫారియా

రీటా ఫారియా.. అందాల పోటీలను ఫాలో అయ్యేవారెప్పటికీ మరచిపోని పేరు! మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన తొలి ఇండియనే కాదు తొలి ఏషియన్‌ కూడా! అంతేకాదు మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్‌ డాక్టర్‌! ఇన్ని ఫస్ట్‌లను ప్రీఫిక్స్‌గా పెట్టుకున్న రీటా నిజంగానే ప్రత్యేకమైన మహిళ! ఇప్పుడామెకు 82 ఏళ్లు. ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ డేవిడ్‌ వెల్‌ను పెళ్లి చేసుకుని ఐర్లండ్‌లో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లూ డాక్టర్లే, అమ్మలాగే వాళ్లూ స్పోర్ట్స్‌ పర్సన్సే గోల్ఫ్‌లో! రీటా 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుండటం వల్ల స్కూల్లో, కాలేజీలో ఆమెను ‘మమ్మీ లాంగ్‌ లెగ్స్‌’ అంటూ ఆటపట్టించేవాళ్లట. అయితే ఆమె దాన్ని అవకాశంగా మలచుకుంది. పొడుగు కాళ్లతో స్పోర్ట్స్‌లో బాగా రాణించవచ్చని గ్రహించి.. త్రోబాల్, నెట్‌బాల్, బాడ్మింటన్‌ నుంచి హాకీ దాకా అన్ని ఆటలూ ఆడారు. పెయింటింగ్‌ వేస్తారు. డాక్టర్‌ అయ్యి.. మంచి ఫిజీషియన్‌గా పేరు తెచ్చుకున్నారు. అసలు మిస్‌ వరల్డ్‌ కోసం ప్రయాణం... రీటా ఫారియా స్వస్థలం ముంబై. తాతల కాలంలోనే గోవా నుంచి వచ్చి ముంబైలో స్థిరపడిన ఓ సామాన్య కుటుంబం. నాన్న.. జాన్, ఒక మినరల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తే.. అమ్మ.. ఆంటోయినెట్, బ్యూటీ పార్లర్‌ నడిపేవారు. రీటా అక్క ఫిలోమెనా. రీటా మిస్‌ వరల్డ్‌ దాకా వెళ్లడానికి ప్రోత్సహించింది ఆమే! రీటా మెడిసిన్‌ ఫైనలియర్‌లో ఉన్నప్పుడే (1966) మిస్‌ బాంబే పోటీల్లో పాల్గొంది. టైటిల్‌ సొంతం చేసుకుంది. తర్వాత వాళ్ల సోదరి ‘మిస్‌ ఇండియా కోసమూ పోటీ పడు’ అంటూ వెన్ను తటింది. అక్కడా టైటిల్‌ ఆమెనే వరించింది. తర్వాత మిస్‌ వరల్డ్‌ వైపూ తోసింది. ఇంచక్కా వేరే దేశం చూడొచ్చన్న ఆశతో తన 23వ ఏట, చేతిలో కేవలం పది పౌండ్ల (అప్పుడు మన దేశ ఫారెక్స్‌ నిబంధనలు కఠినంగా ఉండేవి అందుకే పది పండ్లు)తో ఆ ΄ోటీల కోసం ఫ్లయిట్‌ ఎక్కారు. మిస్‌ వరల్డ్‌ పాజెంట్‌ కోసం కూతురు ఒంటరిగా లండన్‌ వెళ్లడం వాళ్లమ్మను కలవరపరచింది. ఆమె తిరిగొచ్చే వరకూ ఆందోళనతోనే ఉన్నారట. మినిస్టర్‌ కూతురు చీర.. సేల్స్‌లో హీల్స్‌.. మిస్ట్‌ వరల్డ్‌ పోటీల మీద సరైన అవగాహన, పోటీల్లో ఈవినింగ్‌ వేర్, గౌన్, పర్సనాలిటీ చాలెంజ్, మిస్‌ వరల్డ్‌ నైట్‌.. లాంటి ముఖ్యమైన ఘట్టాలకు సూట్‌ అయే దుస్తులూ లేకుండానే పీల్గొంది రీటా. ఈవెనింగ్‌ వేర్‌లో చీరే కట్టుకోవాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే తన దగ్గర చీర మాత్రమే ఉంది. చీరను ఇండియన్‌ ట్రెడిషనల్‌ వేర్‌గానూ ప్రెజెంట్‌ చేయొచ్చు అనుకుంది. ఆ చీర కూడా అప్పటి మిస్‌ ఇండియా ఏజెంట్‌ ఆర్గనైజేషన్‌తో అనుబంధం ఉన్న మహారాష్ట్ర నాటి మినిస్టర్‌ పాజ్‌పేయి కూతురి పెళ్లి చీర. నగలు కూడా అరువు తీసుకున్నవే! ఆర్గనైజర్స్‌ ఆమె వార్డ్‌ రోబ్‌ చూసి అవాక్కయ్యారట. ఏమీ లేకుండా ఎలా పాల్గొనబోతోందీ అమ్మాయి అని! ఆమె పొడగరి కావడం వల్ల ఆమెకిచ్చిన స్విమ్‌ సూట్‌ కురచదైపోయిందట. తన దగ్గరున్న హీల్స్‌ ఆ పోటీలకు కావల్సిన ఎత్తు కన్నా తక్కువ ఎత్తున్నవి. ఏం చేయాలో పాలుపోక.. ఒకరోజు తన దగ్గరున్న పది పౌండ్లతో ఎక్కడ దొరుకుతాయో వెదుక్కోసాగింది. అదృష్టవశాత్తు ఒక షాపులో మూడు డ్లకు మంచి స్విమ్‌ సూట్, అర పౌండ్‌కి కావల్సిన హీల్స్‌ దొరికాయి ఆమెకు. వాటితోనే పోటీలకు తలపడింది. విశేషమేమంటే ఆ రౌండ్‌లో ఆమెకు ‘బెస్ట్‌ స్విమ్‌సూట్‌’ సబ్‌ టైటిల్‌ దక్కింది. అంతేకాదు ఈవెనింగ్‌ వేర్‌ ఈవెంట్‌లో శారీతో ప్రత్యక్షమై ‘బెస్ట్‌ ఈవెనింగ్‌ వేర్‌’ సబ్‌ టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఫైనల్‌ ఈవెంట్‌లో కూడా జడ్జెస్‌ అడిగిన ప్రశ్నలుకు చక్కటి సమాధానంతో 51 కంటెస్టెంట్లతో పోటీపడి ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని అందుకుంది. ఇక వాళ్లమ్మ సంతోషానికి అవధుల్లేవట! ‘అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. కిరీటం గెలుచుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. నాకున్న అరకొర ఏర్పాట్లతో దీన్నెలా సాధించగలిగానా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పటివాళ్లలాగా అప్పట్లో ఏడాది ముందు నుంచే ప్రిపరేషన్లు ఉండేవి కావు. ఇప్పటి వాళ్లు స్పష్టమైన లక్ష్యంతో దానికోసం ట్రైన్‌ అవుతున్నారు’ అని చెబుతారు రీటా ఫారియా పావెల్‌. గెలిచాక.. రీటా ఫారియాకు మోడలింగ్‌లో, సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తన డాక్టర్‌ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే వాటన్నిటికీ నో చెప్పారు. అంతేకాదు మిస్ట్‌ వరల్డ్‌గా వేదికల మీద పర్సనల్‌ అపియరెన్స్‌ ఇచ్చానే తప్ప ఎలాంటి కమర్షియల్స్‌కి అడ్వర్టయిజ్‌ చేయలేదు. ఆమె కమిట్‌మెంట్‌కు ముచ్చటపడ్డ లండన్‌లోని ప్రిస్టేజియస్‌ కింగ్స్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ సిబ్బంది తమ కాలేజీలో చదువు కొనసాగించమని ఆహ్వానించారు. అక్కడే డాక్టర్‌ యురోపియన్‌ డేవిడ్‌ పావెల్‌ ఈ డస్కీ బ్యూటీ రిటాను కలుసుకున్నాడు. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు అయిదురుగు మనవలు, మనవరాళ్లు. ఇప్పటికీ రీటా అంతే బిజీగా, అంతే ఉత్సాహంగా ఉంటారు. గోల్ఫ్‌ ఆడుతారు. గార్డెనింగ్‌ చేస్తారు. ఇంటి పనీ, వంట పనీ చేస్తారు. భార్యాభర్తలిద్దరూ క్లాసికల్‌ మ్యూజిక్‌ క్లాసెస్‌కూ వెళ్తారు.– సరస్వతి రమ(చదవండి: అందాల పోటీలకూ నియమ నిబంధనలు ఉంటాయి)

Pooja Hegde Powerful Portrayal Of Rukmini In Retro Movie8
‘రుక్కు’తో గ్లామర్‌ ముద్రను చెరిపేసిన పూజా హెగ్డే

కొందరు నటీమణులపై కొన్ని రకాల పాత్రలే చేయగలరనే ముద్ర వేస్తుంటారు. అలా ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితం అనే ముద్ర పడిన నటి పూజాహెగ్డే(Pooja Hegde). అయితే అది తప్పు అని తాజాగా ఈ బ్యూటీ నిరూపించుకున్నారు. అవకాశం వస్తే ఎలాంటి పాత్రనైనా చేయగలనని రెట్రో చిత్రంలో రుక్కుమణిగా జీవించారు. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా కథానాయకి పాత్రలో పూజాహెగ్డే నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించడం విశేషం. ఈమె ఇంతకుముందు గ్లామర్‌ పాత్రల్లో నటించి కుర్రకారును విపరీతంగా అలరించారు. దీంతో రెట్రో చిత్రంలో నటించడంతో పూజాహెగ్డే నుంచి ఆ తరహా అందాలను ఆశించారు.అయితే రెట్రో చిత్రంలో రుక్కుమణి పాత్రలో ఆమె నటనను చూసిన అభిమానులు థ్రిల్లయ్యారనే చెప్పాలి. రుక్కుమణి పాత్రలో పూజాహెగ్డే నటించలేదు. పాత్రలో జీవించారు అంటున్నారు. చిత్రంలో చాలా యథార్థ నటనతో ఆకట్టుకున్నారని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో రుక్కు పాత్రనే కనిపించిందని, ఆమె కనిపించలేదని అభినందిస్తున్నారు. సూర్యతో ప్రేమ సన్నివేశాల్లోనూ, ఆయన నుంచి విడిపోయిన సన్నివేశాల్లోనూ ఆమె నటన అందరినీ ఆకట్టుకుందంటున్నారు. చిత్రం ప్రారంభం నుంచి పూజాహెగ్డే ఒక నటిగా భావించకుండా రుక్కుగా మారి జీవించారని, ఆ పాత్రకే వన్నె తెచ్చారని అంటున్నారు. చిత్రంలో రుక్కుగా ఆమెకు ఎక్కువగా మాట్లాడలేదని, అయినప్పటికీ తన మౌనం ద్వారా భావాలను అద్భుతంగా పలికించారని, ఆమె కళ్లల్లో బాధ, నమ్మకం, ప్రేమ వంటి భావాలను తన అభినయంతో చక్కగా పండించారంటూ అభినందిస్తున్నారు. మొత్తం మీద రెట్రో చిత్రంలో మరో పూజాహెగ్డే కనిపించారని ప్రశంసలను అందుకుంటున్నారీ బ్యూటీ. కాగా ప్రస్తుతం ఈమె నటుడు విజయ్‌కు జంటగా జననాయకన్‌ చిత్రంతో పాటు, రాఘవలారెన్స్‌ సరసన కాంచన–4 చిత్రంలో నటిస్తున్నారు.

Chennai Super Kings beat Kolkata Knight Riders by 2 wickets9
కోల్‌కతాకు చెన్నై ఝలక్‌

కోల్‌కతా: ఐపీఎల్‌ ‘ప్లే ఆఫ్స్‌’ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అజింక్య రహానే (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్‌ (21 బంతుల్లో 38; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (28 బంతుల్లో 36 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించగా...నూర్‌ అహ్మద్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు సాధించింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...శివమ్‌ దూబే (40 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన ఉర్విల్‌ పటేల్‌ (11 బంతుల్లో 31; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. పవర్‌ప్లేలోపే సగం వికెట్లు కోల్పోయి 60/5 వద్ద నిలిచిన చెన్నై ఓటమి ఇక లాంఛనమే అనిపించింది. కానీ బ్రెవిస్, దూబే పోరాడంతో పాటు చివర్లో ధోని (17 నాటౌట్‌) పట్టుదలగా నిలబడటంతో గెలుపు సాధ్యమైంది. తాజా ఫలితంతో కోల్‌కతా ‘ప్లే ఆఫ్స్‌’కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. మిగిలిన 2 మ్యాచ్‌లలో గెలిచి గరిష్టంగా 15 పాయింట్లకు చేరినా ముందుకెళ్లడం కష్టమే. సాంకేతికంగా రేసులో ఉన్నా... ఈసారి కథ ముగిసినట్లే! ఐపీఎల్‌లో నేడుపంజాబ్‌ X ఢిల్లీవేదిక: ధర్మశాలరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Rasi Phalalu: Daily Horoscope On 08-05-2025 In Telugu10
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. వ్యాపారాలలో ముందడుగు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.ఏకాదశి ప.1.42 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తర రా.10.07 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృత ఘడియలు: ప.2.24 నుండి 4.10 వరకు.సూర్యోదయం : 5.35సూర్యాస్తమయం : 6.17రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరతాయి.వృషభం... కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.మిథునం... రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.కర్కాటకం... ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పనులు చకచకా సాగుతాయి..సింహం.... కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఆకస్మిక ప్రయాణాలు.వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.కన్య.... కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు.విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.తుల... ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.వృశ్చికం... నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళాకారులకు సన్మానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.ధనుస్సు..... పనులు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.మకరం.... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి కుంభం....అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు.మీనం.... కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలబ్ధి. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement