
అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీలో మంటలు
గోదాం దగ్ధం
● భయంతో పరుగులు తీసిన కూలీలు, రైతులు ● రూ. 1.50 కోట్ల నష్టం
కొండపాక(గజ్వేల్): ప్రమాదవశాత్తు అరటి పండ్ల కోల్డ్ స్టోరేజీ గోదాంకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. పెద్దఎత్తున దట్టమైన పొగలు, మంటలు ఎగసి పడటంతో గోదాంలో పని చేసే కూలీలు, సమీప వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మండల పరిధిలోని మర్పడ్గ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మర్పడ్గ నుంచి ఖమ్మపల్లికి వెళ్లే దారిలో అర ఎకరం భూమిలో సుమారు రూ.2 కోట్లతో సిద్దిపేటకు చెందిన వ్యాపారులు కోల్డ్ స్టోరేజీ అరటి పండ్ల గోదాం నిర్వహిస్తున్నారు. అరటి తోటల నుంచి కాయలను తీసుకువచ్చి కోల్డ్ స్టోరేజీలో పండ్లుగా మార్చుతారు. వీటిని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల పట్టణాలకు సరఫరా చేస్తుంటారు. సాయంత్రం వేళ గోదాంలోంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు వచ్చాయి. బావుల నుంచి నీళ్లు తెచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది. దీంతో సుమారు రూ.1.50 కోట్ల వరకు నష్టం జరిగిందంటూ గోదాం నిర్వాహకులు పేర్కొన్నారు.