
ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్న వేల బంగ్లాదేశ్, జింబాబ్వే మధ్య టెస్ట్ మ్యాచ్ మొదలైంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వే జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 20) తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు జింబాబ్వే బౌలర్లు రెచ్చిపోయారు. ముజరబానీ, వెల్లింగ్టన్ మసకద్జ తలో 3.. న్యాయుచి, మదెవెరె చెరో 2 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది.
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో అత్యల్ప స్కోర్. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (40), జాకిర్ అలీ (28), మహ్మదుల్ హసన్ రాయ్ (14), షద్మాన్ ఇస్లాం (12), హసన్ మహమూద్ (19) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ ముష్ఫికర్ రహీం 4, మెహిది హసన్ మిరాజ్ 1, తైజుల్ ఇస్లాం 3, నహిద్ రాణా డకౌటయ్యారు. ఖలీద్ అహ్మద్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ 40, బెన్ కర్రన్ 17 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
స్వదేశంలో బంగ్లాదేశ్ అత్యల్ప స్కోర్లు (టెస్ట్‌ల్లో)
ఢాకా- 107 (2001)
సిల్హెట్- 143 (2018)
సిల్హెట్- 169 (2018)
సిల్హెట్- 191 (2025)
ఢాకా- 211 (2005)