
క్రీడా సమాఖ్యల తీరు మారాల్సిందే
అథ్లెట్ల సౌకర్యార్థం డిజీలాకర్
క్రీడాకారులకు మెరుగైన ఉద్యోగావకాశాలు
కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారాన్ని కోరతామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్‌లో క్రీడల సంస్కృతి పెరిగేందుకు, అథ్లెట్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మనదేశంలో ప్రతీ క్రీడాంశానికి ప్రత్యేక ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయన్నారు.
ఎక్సలెన్సీలతో ఎంతో మేలు
‘ప్రతి క్రీడ కోసం ప్రత్యేకంగా అధునాతన సదుపాయాలతో ఒలింపిక్ సెంటర్ లేదంటే ఎక్సలెన్సీ కేంద్రం నిర్మించాలనేదే నా లక్ష్యం. వచ్చే పదేళ్లలో ఇలాంటి కేంద్రాల ద్వారా ప్రతిభావంతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడు క్రీడా ప్రగతే మారుతుంది. ఇందుకోసం ప్రముఖ కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కోరతాం. వారి నిధులతో ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఎక్సలెన్సీలను నిర్మించే యోచనలో ఉన్నాం.
ప్రస్తుతం దేశంలో ఉన్న 23 జాతీయ ఎక్సలెన్సీ కేంద్రాలన్నీ ప్రభుత్వానివే! భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) ఆధ్వర్యంలోనే ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. మనకన్నా చిన్న దేశాలు ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్నాయి. జపాన్, ఆ్రస్టేలియా, అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల మోడల్‌ను అధ్యయనం చేశాం. మన ఎక్సలెన్సీలకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తోడవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.
వర్గపోరును సహించం
జాతీయ క్రీడా సమాఖ్యల పంథా మారాల్సిందే. ఏ సమాఖ్య అయినా సరే తమ ఆట, అథ్లెట్‌లకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెట్టాలి. క్రీడేతర అంశాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సమాఖ్యలో వర్గపోరును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. దీని వల్ల ఆ క్రీడకు, అథ్లెట్‌కు వాటిల్లే నష్టమెంటో మాకు తెలుసు. కాబట్టి సమాఖ్యలన్నీ కూడా ఆయ క్రీడాకారుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, వెన్నంటే తోడ్పాటు తదితర అంశాలను గుర్తుంచుకొని వ్యవహరించాలి. వర్గపోరుతో అథ్లెట్ల ప్రయోజనాల్ని దెబ్బతీసే సమాఖ్యల తీరును ఎంతమాత్రం ఉపేక్షించం.
ఐక్య కార్యచరణ సమితి అవసరం
భారత్ ఇదివరకు 2030 కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేసింది. దీనికి ముందే 2036 ఒలింపిక్స్ కోసం ప్రాథమిక దశలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ను దాఖలు చేసింది. ఇలా మన సత్తా, సాధన సంపత్తిని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ముందు గట్టిగా విశదీకరించేందుకు, లేదంటే ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఒక ఐక్య కార్యచరణ సమితి అవసరం ఎంతో ఉంది. మన రెజ్లింగ్ సమాఖ్యకు అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య సమస్యలెదురయ్యాయి. ఐక్య సమితి ఉంటే మన వాదన వినిపించొచ్చు.
ప్రత్యేక డిజీలాకర్
ఆటగాళ్లు వారి ప్రదర్శనలు, వాళ్లకు అవసరమైన పత్రాలు, దరఖాస్తులు ఇకపై డిజిటలైజ్ చేస్తాం. అంటే ప్రతిదానికి వేర్వేరు పత్రాలు, దరఖాస్తులు అవసరముండవు. ఆటగాళ్ల ఘనతల్ని ప్రత్యేక డిజీలాకర్‌లో భద్రబరిచే కార్యక్రమాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య విధిగా డిజీలాకర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిందే. అయితే ఒలింపిక్ పతక విజేతలకు దరఖాస్తులు, పత్రాలు వ్యక్తిగతంగా డిజీలాకర్‌లో నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచం యావత్తు చూసిన పతక విజేతల ఘనత ప్రత్యేకంగా లిఖించాలా?
కొండంత భరోసాగా ఉద్యోగాలు
క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని కఠోరంగా శ్రమించి పతకాలు తెచ్చే క్రీడాకారులకు ఉద్యోగ భరోసా కూడా లభిస్తోంది. 25 వేల పైచిలుకు క్రీడకారులు వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ఈ స్థిరమైన ఆర్థిక భరోసా వల్ల ఆటగాళ్లు మరింత క్రీడల్లో రాణించేందుకు, రాటుదేలేందుకు, నాణ్యమైన శిక్షణ పొందెందుకు దోహదపడుతుంది.