
వచ్చే 10–12 ఏళ్లలో కల్పించాలి
జీడీపీలో తయారీ వాటా పెంచుకోవాలి
అప్పుడే 2047 నాటికి సంపన్న దేశ లక్ష్యం సాధ్యం
సీఈఏ నాగేశ్వరన్ వెల్లడి
న్యూయార్క్: వచ్చే 10–12 ఏళ్లలో భారత్ ఏటా 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తేనే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాకారమవుతుందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకోసం స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా కూడా మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1990లలో సంస్కరణలు అమల్లోకి వచ్చాక సుమారు ముప్ఫై ఏళ్ల పాటు దేశానికి వెలుపల పరిస్థితులు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ, వచ్చే 10–20 ఏళ్ల పాటు అలా ఉండకపోవచ్చని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో చైనా ఏ విధంగానైతే తయారీ రంగంలో ఆధిపత్యం సాధించిందో, మనం కూడా జీడీపీలో తయారీ రంగ వాటాను పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొలంబియా వర్సిటీలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సంపన్న దేశాలకు కృత్రిమ మేథ, టెక్నాలజీ, రోబోటిక్స్‌లాంటివి సవాలు కాదని, కానీ అభివృద్ధి ప్రస్థానంలో ఉన్న దేశాలకు సమస్యాత్మకంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ‘భారీ జనాభా ఉండే భారత్ ఇది పెద్ద సవాలే. దీనికి సులభతరమైన సమాధానాలేమీ లేవు. ఓవైపు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు, ఐటీ నైపుణ్యాల అవసరం తక్కువగా ఉండే సరీ్వస్ కొలువులకు కృత్రిమ మేథతో ముప్పు పొంచి ఉంది. మరోవైపు, ఏటా 80 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది‘ అని నాగేశ్వరన్ వివరించారు.
చిన్న సంస్థలకు అనుకూల పరిస్థితులు కల్పించాలి..
2047 నాటికి భారతీయ సంస్థలను అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లలో భాగం చేయడంతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) అనుకూల పరిస్థితులు కల్పించాల్సి ఉంటుందని నాగేశ్వరన్ చెప్పారు. తయారీ, ఎంఎస్‌ఎంఈలు రెండూ కలిసి ప్రయాణిస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శక్తివంతమైన తయారీ హబ్‌లుగా ఎదిగిన దేశాలన్నింటిలోనూ ఎంఎస్‌ఎంఈలకు అనువైన పరిస్థితులను కల్పించడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని నాగేశ్వరన్ చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను మరింత రాబట్టుకోవడమో లేదా వచ్చిన పెట్టుబడులను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంపైనో దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
8 శాతం వృద్ధి రేటు కష్టమే..
ప్రస్తుత పరిస్థితుల్లో 8 శాతం వృద్ధి రేటును నిలకడగా సాధించడం కష్టమైన వ్యవహారమేనని నాగేశ్వరన్ తెలిపారు. అయితే, దేశీయంగా నియంత్రణలను సడలించడంపై దృష్టి పెట్టి, రాబోయే ఒకటి..రెండు దశాబ్దాల పాటు స్థిరంగా 6.5 శాతం వృద్ధినైనా సాధించగలిగితే.. నెమ్మదిగా 7 శాతం వైపు వెళ్లొచ్చని ఆయన చెప్పారు. విధానాలపరంగా చూస్తే, గతంలోలాగా జీడీపీ వృద్ధిలో ఎగుమతులు ప్రాధాన్య పాత్ర పోషించే పరిస్థితి ఉండకపోవచ్చని నాగేశ్వరన్ వివరించారు.
ఆర్థిక సంక్షోభానికి ముందు తొలి దశాబ్దకాలంలో ఏటా జీడీపీ వృద్ధిలో ఎగుమతుల వాటా 40 శాతం వరకు ఉండేదని, అప్పట్లో స్థూల దేశీయోత్పత్తి సగటున 8–9 శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. రెండో దశాబ్ద కాలంలో జీడీపీ వృద్ధిలో ఎగుమతుల వాటా 20 శాతానికి పడిపోయిందని, మూడో దశాబ్ద కాలంలో ఇది మరింతగా తగ్గిపోవచ్చని నాగేశ్వరన్ చెప్పారు. అలాగని ఎగుమతులను తక్కువ చేసి చూడటానికి వీల్లేదని, వాటితో పాటు దేశీయంగా నాణ్యత, పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, లాజిస్టిక్స్, లాస్ట్–మైల్ కనెక్టివిటీలాంటి అంశాలపైనా మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని వివరించారు.