
India vs Australia Test Series 2023: ‘‘తదుపరి టెస్టులో తనని తప్పిస్తారని అతడికి తెలుసు. కేవలం ఒకటో రెండో ఇన్నింగ్స్ కారణంగా అతడిపై వేటు పడటం లేదు.. గత ఐదారు మ్యాచ్‌లలో విఫలమైన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న విషయాన్ని గ్రహించాలి.
అతడు వరల్డ్‌క్లాస్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్. కానీ ప్రస్తుతం అతడి ఆటలో సాంకేతిక లోపాలు ఉన్నాయి. తనకి కాస్త విరామం కావాలి. విశ్రాంతి తీసుకున్న తర్వాత వన్డేలకు ఫ్రెష్‌గా తిరిగి రావాలి’’ అని టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.
దారుణ వైఫల్యం
8, 12, 10, 22, 23, 10, 2, 20, 17, 1.. గత పది టెస్టు మ్యాచ్‌లలో ఓపెనింగ్ బ్యాటర్ రాహుల్ నమోదు చేసిన స్కోర్లు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను కాదని తనకు అవకాశమిచ్చిన మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
దీంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ కర్ణాటక బ్యాటర్‌ను వైస్ కెప్టెన్సీ హోదా నుంచి తొలగించినట్లు సంకేతాలు ఇచ్చింది బీసీసీఐ. మూడో టెస్టులో అతడికి ఉద్వాసన పలకనున్నట్లు హింట్ ఇచ్చింది.
టాయ్‌లెట్‌లోకి వెళ్లి ఏడ్వడమే
ఈ క్రమంలో దినేశ్ కార్తిక్ క్రిక్‌బజ్ షోలో కేఎల్ రాహుల్ అవకాశాల గురించి ఈ మేరకు స్పందించాడు. ‘‘ఇది ప్రొఫెషనల్ వరల్డ్. ఇక్కడ మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓ ఆటగాడిగా వీటన్నింటికీ సిద్ధపడాలి. ఎప్పుడైతే మరీ తక్కువ స్కోరుకే చెత్త షాట్ సెలక్షన్ కారణంగా అవుట్ అవుతామో.. అప్పుడు బాధ తప్పదు.
నా విషయంలోనూ ఇలా జరిగింది. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన తర్వాత.. టాయ్‌లెట్‌కి వెళ్లి కన్నీటి చుక్కలు రాల్చాను. అంతకంటే చేసేదేమీ ఉండదు కదా! ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని డీకే చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రాహుల్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడని.. మూడో టెస్టులో తన ఓటు శుబ్‌మన్ గిల్‌కే వేస్తానని దినేశ్ కార్తిక్ స్పష్టం చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌కు రాహుల్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకునే అర్హత ఉందని అభిప్రాయపడ్డాడు.
చదవండి: Joe Root: 'రూట్' దారి తప్పింది.. 'నా రోల్ ఏంటో తెలుసుకోవాలి'
Suryakumar Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూర్యకుమార్ యాదవ్