
కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న సమయంలో భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా (Ashish Nehra) తనకు మానసికంగా ధైర్యాన్నిస్తూ అండగా నిలిచాడని వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) గుర్తు చేసుకున్నాడు. అతడి స్ఫూర్తిదాయక మాటలతో తాను ప్రతికూల పరిస్థితులను అధిగమించానని పంత్ అన్నాడు.
ఆయన మాటలు మంత్రంలా పనిచేశాయి
‘కష్టకాలంలో ఒక సలహా నాపై బాగా ప్రభావం చూపించింది. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా.. నేను ఆడే స్థానిక క్లబ్‌లో కూడా సీనియర్. ఆయన నా వద్దకు వచ్చి నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నాడు.
నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేస్తూ ఉండు. నేను కూడా గతంలో చాలా సార్లు గాయాలబారిన పడ్డాను. అయినా సరే అన్నీ మరచి ఆనందంగా ఉండటం ముఖ్యం అని నెహ్రా చెప్పాడు. నేను కోలుకునే క్రమంలో ఈ మాటలు బాగా ప్రభావం చూపించాయి’ అని పంత్ వివరించాడు.
సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితి
ఒకటి, రెండు రోజుల్లోనే కోలుకోలేనని వాస్తవం అర్థమైన తర్వాత తనను తాను తిట్టుకోవడం మానేశానని, ప్రతికూల విషయాల గురించి ఆలోచించడం తగ్గించాలని పంత్ చెప్పాడు. కారు ప్రమాదం వల్ల తాను జీవితాన్ని చూసే విధానం మారిందని రిషభ్ పంత్ భావోద్వేగంతో అన్నాడు. ఇది క్రికెట్ గురించి తన ఆలోచనలను కూడా మార్చేసిందని భారత వికెట్ కీపర్ పేర్కొన్నాడు.
‘ప్రమాదం తర్వాత నేను చాలా చిన్న చిన్న పనులు కూడా సొంతంగా చేసుకోలేకపోయేవాడిని. సొంతంగా పళ్లు కూడా తోముకోలేని దుస్థితి. అంతా బాగున్నట్లు మనం ఇలాంటివి పట్టించుకోం. కానీ వాటి విలువ నాకు అప్పుడు అర్థమైంది.
నా ఆలోచనా ధోరణి మారింది
క్రీడల్లో కూడా ప్రతి రోజూ బాగా ఆడాలనే కోరుకుంటాం. కానీ అది ఎప్పుడూ జరగదు. ఇలాంటి అంశాల్లో ప్రమా దం తర్వాత నా ఆలోచనా ధోరణి మారింది’ అని పంత్ వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్ ప్రదర్శన బాగా లేదు. అయితే తాను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నానని, పరిస్థితి మారుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.
చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్