
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కర్ణాటక ఆటగాడి బ్యాటింగ్ స్థానాన్ని పదే పదే మార్చడం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. స్పేర్ టైర్ కంటే కూడా దారుణంగా మేనేజ్‌మెంట్ అతడి సేవలను వాడుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం
ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) స్పందించాడు. జట్టులో తన పాత్ర పట్ల కేఎల్ రాహుల్ సంతృప్తిగా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
అనంతరం ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఇటీవలి వన్డే సిరీస్‌లో ఒక్కోసారి ఆరో స్థానంలో ఆడించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగిస్తున్నారు. వీలునుబట్టి ఐదో స్థానంలో కూడా ఆడిస్తున్నారు.
అయితే, ఇలా పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్ మారుతున్నా కేఎల్ రాహుల్ సంతోషంగానే ఉన్నాడని కోచ్ సితాన్షు కొటక్ చెప్పడం విశేషం. ‘‘అతడు ఓపెనింగ్ చేయగలడు. నాలుగు లేదంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. డిమాండ్‌ను బట్టి ఆరో స్థానంలోనూ ఆడతాడు.
జట్టుకు ఏది అవసరమో అది చేస్తాడు
పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అతడికి ఇష్టం. జట్టులో తన పాత్ర పట్ల అతడు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాడు. రాహుల్ వంటి నాణ్యమైన బ్యాటర్ ఆరో స్థానంలో అందుబాటులో ఉండటం జట్టుకు అదనపు ప్రయోజనం.
బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల గురించి నేను తనతో మాట్లాడినపుడు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు. జట్టుకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నాతో అన్నాడు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా వన్డేల్లో ఐదో స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. 1299 పరుగులు సాధించాడు. సగటు 56.47. ఇందులో రెండు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో రాహుల్ ఏడుసార్లు బ్యాటింగ్ చేసి 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇదిలా ఉంటే.. కివీస్‌తో టైటిల్ పోరు గురించి సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లంతా కలిసికట్టుగా ఉంటూ.. ఆట గురించి చర్చిస్తూ ఉంటారు. ఏ జట్టుకైనా ఇంతకంటే విలువైన, గొప్ప విషయం మరొకటి ఉండదు.
రోహిత్, విరాట్, హార్దిక్, షమీ, జడేజా.. జట్టులో ఉండటం సానుకూలాంశం. వాళ్లలో చాలా మందికి 15- 20 ఏళ్ల అనుభవం ఉంది. యువ ఆటగాళ్లు సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఫైనల్ విషయంలో మా జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు’’ అని పేర్కొన్నాడు.