
టీమిండియాకు గుడ్ న్యూస్. తల్లి అనారోగ్య సమస్య కారణంగా మ్యాచ్ మధ్యలోనే చెన్నైకి వెళ్లిపోయిన రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులో చేరనున్నాడు. యాష్ ఇవాళ (ఫిబ్రవరి 18) లంచ్ విరామం సమయానికంతా జట్టుతో జతకడతాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.
కాగా, తల్లిని చూసేందుకు హుటాహుటిన ఇంటికి బయల్దేరిన అశ్విన్‌కు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం తమకెంతో ముఖ్యమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంటే, మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 383 పరుగుల లీడ్‌లో ఉంది. ఇవాల్టి ఆటలో కుల్దీప్ తప్పిదం కారణంగా శుభ్‌మన్ గిల్ (91) అనవసరంగా రనౌటయ్యాడు.
గాయం కారణంగా నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి ఇవాళ తిరిగి క్రీజ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం యశస్వి (114), కుల్దీప్ (27) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.
స్కోర్ వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్ (రోహిత్ 131, జడేజా 112)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ (బెన్ డకెట్ 153)
భారత్ సెకెండ్ ఇన్నింగ్స్: 257/3 (యశస్వి 115 నాటౌట్)