
అవేశ్ అద్భుత బౌలింగ్
రాజస్తాన్‌పై 2 పరుగులతో నెగ్గిన సూపర్‌జెయింట్స్
జైపూర్: ఆఖరి ఓవర్... ఆఖరి బంతిదాకా ఇరు జట్లతోనూ దోబూచులాడిన విజయం చివరకు లక్నో సూపర్‌జెయింట్స్‌ను వరించింది. రాజస్తాన్ రాయల్స్ 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ అద్భుతం చేశాడు. 6 పరుగులే ఇచ్చి ప్రమాదకర హిట్టర్ హెట్‌మైర్‌ను అవుట్ చేశాడు. దీంతో ఉత్కంఠ రేపిన పోరులో సూపర్‌జెయింట్స్ 2 పరుగులతో అనూహ్యంగా రాయల్స్‌పై గెలిచింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
మార్క్‌రమ్ (45 బంతుల్లో 66; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆయుశ్ బదోని (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ఆఖరి ఓవర్లో సమద్ (10 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్స్‌లు) చెలరేగాడు. హసరంగకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి ఓడింది. యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు.
మార్క్‌రమ్, బదోని ఫిఫ్టీ–ఫిఫ్టీ
పవర్‌ప్లే ముగియక ముందే హిట్టర్లు మార్ష్ (4), పూరన్ (11), పవర్ ప్లే తర్వాత కెపె్టన్ రిషభ్ పంత్ (3) అవుటవడంతో లక్నో 54 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ మార్క్‌రమ్, ఆయుశ్ బదోని సూపర్‌జెయింట్స్ స్కోరు భారాన్ని మోశారు. ఇద్దరు వేగంగా ఆడటంతో జట్టు పరుగుల జోరందుకుంది. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న మార్క్‌రమ్ నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించాక అవుటయ్యాడు. కాసేపటికి బదోని 33 బంతుల్లో బదోని అర్ధ సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు.
సమద్ 4 సిక్సర్లతో...
19 ఓవర్లలో 153/5 వద్ద ఓ మోస్తరు స్కోరు చేసిన లక్నో శిబిరంలో ఆఖరి ఓవర్ ఆనందం నింపింది. సందీప్ వేసిన 20వ ఓవర్లో మిల్లర్ (7 నాటౌట్) సింగిల్ తీసివ్వగా తర్వాత సమద్ 6, 6, 2, 6, 6లతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. దీంతో సూపర్‌జెయింట్స్ స్కోరు 180కి చేరింది.
జైస్వాల్ శ్రమించినా...
యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కొత్త కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఇద్దరి ఓపెనర్ల వేగం రాజస్తాన్‌ను లక్ష్యం వైపు నడిపించింది. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక వైభవ్ ఆటను మార్క్‌రమ్ ముగించగా, నితీశ్ రాణా (8)ను శార్దుల్ పెవిలియన్ చేర్చాడు.
తర్వాత జైస్వాల్‌కు జతయిన కెపె్టన్ రియాన్ పరాగ్ రన్‌రేట్ తగ్గకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన జైస్వాల్ దూకుడు పెంచాడు. లక్ష్యానికి చేరువైన దశలో 18వ ఓవర్లో జైస్వాల్, పరాగ్‌లను అవుట్ చేసిన అవేశ్...ఆఖరి ఓవర్లో హెట్‌మైర్ (12)కు చెక్ పెట్టాడు.

స్కోరు వివరాలు
లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 4; మార్క్‌రమ్ (సి) పరాగ్ (బి) హసరంగ 66; నికోలస్ పూరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 11; రిషభ్ పంత్ (సి) జురేల్ (బి) హసరంగ 3; ఆయుశ్ బదోని (సి) దూబే (బి) తుషార్ 50; మిల్లర్ నాటౌట్ 7; సమద్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–16, 2–46, 3–54, 4–130, 5–143. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–32–1, తీక్షణ 4–0–32–0, సందీప్ శర్మ 4–0–55–1, తుషార్ దేశ్‌పాండే 4–0–26–1,హసరంగ 4–0–31–2.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) అవేశ్ 74; వైభవ్ (స్టంప్డ్) పంత్ (బి) మార్క్‌రమ్ 34; నితీశ్ రాణా (సి) అవేశ్ (బి) శార్దుల్ 8; రియాన్ పరాగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అవేశ్ 39; జురేల్ నాటౌట్ 6; హెట్‌మైర్ (సి) శార్దుల్ (బి) అవేశ్ 12; శుభమ్ నాటౌట్ 3 ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–85, 2–94, 3–156, 4–161, 5–175. బౌలింగ్: శార్దుల్ 3–0–34–1, అవేశ్ ఖాన్ 4–0–37–3, దిగ్వేశ్ రాఠి 4–0–30–0, మార్క్‌రమ్ 2–0–18–1, ప్రిన్స్ 4–0–39–0, రవి బిష్ణోయ్ 3–0–19–0.
14 ఏళ్ల 23 రోజుల వయసులో...
ఐపీఎల్ వేలం సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. లీగ్ బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్ తన తొలి బంతికే సిక్స్ బాది సంచలన రీతిలో మొదలు పెట్టాడు. ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఆ షాట్‌ను అద్భుతంగా ఆడిన అతని సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
చెలరేగిపోతున్న దశలో అనూహ్యంగా స్టంపౌట్ కావడంతో వైభవ్ తట్టుకోలేకపోయినట్లున్నాడు. కన్నీళ్లతో అతను నిష్క్రమించాడు! బిహార్‌కు చెందిన ఈ ప్రతిభాశాలి ఇప్పటికే భారత అండర్–19 జట్టు తరఫున ఆడటంతో పాటు 5 రంజీ మ్యాచ్‌లలో కూడా బరిలోకి దిగాడు. వేలంలో వైభవ్‌ను రాజస్తాన్ రూ.1.10 కోట్లకు తీసుకుంది.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ X బెంగళూరు
వేదిక: ముల్లాన్‌పూర్ ,మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
ముంబై X చెన్నై
వేదిక: ముంబై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం