
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 19) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్ 39, అశుతోష్ శర్మ 37, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్ తలో 31, కేఎల్ రాహుల్ 28, అభిషేక్ పోరెల్ 18, విప్రాజ్ నిగమ్ 0, డొనోవన్ ఫెరియెరా 1, స్టార్క్ 2 (నాటౌట్), కుల్దీప్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆదిలోనే శుభ్‌మన్ గిల్ (7) వికెట్ కోల్పోయినప్పటికీ.. జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ (97 నాటౌట్) కారణంగా 19.2 ఓవర్లలో (3 వికెట్ల నష్టానికి) లక్ష్యాన్ని చేరుకుంది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ 36, రూథర్‌ఫోర్డ్ 43, తెవాతియా 11 పరుగులు (నాటౌట్) చేశారు.
ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఢిల్లీని వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
పాపం బట్లర్
ఈ మ్యాచ్‌లో బట్లర్‌కు సెంచరీ పూర్తి చేసే అవకాశం ఉన్నా 97 పరుగుల వద్ద అజేయంగా నిలిచిపోయాడు. చివరి రెండు ఓవర్లలో గుజరాత్ గెలుపుకు 15 పరుగులు అవసరమైన తరుణంలో బట్లర్ 96 పరుగుల వద్ద ఉన్నాడు.
ఎంత పని చేశావయ్యా తెవాతియా..?
అయితే 19వ ఓవర్‌ను ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌల్ చేయడంతో ఆ ఓవర్‌లో బట్లర్ సెంచరీ కోసం రిస్క్ చేయలేకపోయాడు. చివరి ఓవర్‌లో అయినా మూడంకెల స్కోర్‌ను అందుకుందామా అంటే తెవాతియా అతనికి అడ్డుపడ్డాడు. జట్టు గెలుపుకు 10 పరుగులు అవసరమైన తరుణంలో వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో బట్లర్ చేసేదేమీ లేక జట్టు గెలుపును ఆస్వాదించాడు.
విరాట్ రికార్డు సమమయ్యేది
ఈ మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ పూర్తి చేసి ఉంటే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును సమం చేసేవాడు. విరాట్ ఐపీఎల్‌లో 8 సెంచరీలు చేయగా.. బట్లర్ ఖాతాలో 7 సెంచరీలు ఉన్నాయి. విరాట్ రికార్డును సమం చేసేందుకు బట్లర్‌కు ఇంతకంటే మంచి అవకాశం రాదు.
తెవాతియా కారణంగా బట్లర్ చరిత్రలోనే నిలిచిపోయే అవకాశాన్ని కోల్పోయాడు. ఏదిఏమైనా ఈ మ్యాచ్‌లో బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగానే గుజరాత్ గెలిచింది. సెంచరీ పూర్తి చేసుంటే అతని టాలెంట్‌కు తగ్గ గుర్తింపు దక్కేది.