
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్‌కు ఏడో పతకం
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఏడో పతకం లభించింది. బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఆర్య బోర్సే–రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ జోడీ రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆర్య–రుద్రాంక్ష్ ద్వయం 9–17 పాయింట్ల తేడాతో జిఫె వాంగ్–బుహాన్ సాంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.
కాంస్య పతక మ్యాచ్‌లో నర్మద నితిన్ రాజు–అర్జున్ బబూటా (భారత్) జంట 13–17 పాయింట్ల తేడాతో ఫెర్నాండా రుసో–మార్సెలో జూలియన్ గిటిరెజ్ (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్లు నిరాశపరిచారు. నీరూ 115 పాయింట్లతో 12వ స్థానంలో, ప్రగతి దూబే 110 పాయింట్లతో 17వ స్థానంలో, భవ్య త్రిపాఠి 106 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లోనూ భారత షూటర్లెవరూ ఫైనల్ చేరలేకపోయారు.
జొరావర్ సింగ్ సంధూ 119 పాయింట్లతో ఏడో స్థానంలో, పృథ్వీరాజ్ 117 పాయింట్లతో 16వ స్థానంలో, లక్షయ్ 115 పాయింట్లతో 21వ స్థానంలో నిలిచారు. టాప్–6లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం భారత్ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఏడు పతకాలతో రెండో స్థానంలో ఉంది.