
బెంగళూరు: వరుస సెట్‌లలో గెలిచిన భారత జోడీ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్–రామ్ ద్వయం 6–3, 7–6 (7/4)తో జాకోపో బెరెటిని–ఎన్రికో డల్లా వాలె (ఇటలీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జోడీ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 6–4, 6–4తో గంటా సాయికార్తీక్ రెడ్డి (భారత్)–సుల్తానోవ్ (ఉజ్బెకిస్తాన్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 6–4, 6–3తో నికీ కలియంద పునాచా (భారత్)–జాన్ లాక్ (జింబాబ్వే)లపై, ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్) 4–6, 6–3, 10–6తో ఎంజో కుకాడో (ఫ్రాన్స్)–మైకేల్ గీర్ట్స్ (బెల్జియం)లపై, ఆదిల్ కల్యాణ్‌పూర్–కరణ్ సింగ్ (భారత్) 1–6, 6–2, 10–4తో నితిన్ కుమార్ సిన్హా–మనీశ్ సురేశ్‌కుమార్ (భారత్)లపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు.