
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 6) సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఓడి ఆతర్వాత వరుసగా రెండు విజయాలు సాధించిన గుజరాత్ మాంచి జోష్‌లో ఉండగా.. తొలి మ్యాచ్‌లో మాత్రమే గెలిచి ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకున్న సన్‌రైజర్స్ ఢీలాగా కనిపిస్తుంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వై నాట్ 300 అన్న విషయాన్ని పక్కన పెట్టి గెలుపు కోసం ఆడాలి. కేవలం బ్యాటింగ్‌నే నమ్ముకోకుండా బౌలర్లను కూడా సరిగ్గా వినియోగించుకోవాలి. జట్టులో షమీ, కమిన్స్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా సన్‌రైజర్స్ ఎందుకో బౌలింగ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్ మెరుపులే ఉండాలంటే అది సాధ్యపడదు. సన్‌రైజర్స్ ఇకనైనా కాస్త తగ్గి తక్కువ స్కోర్లు చేసినా డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి.
విధ్వంసకర వీరులుగా చెప్పుకునే ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రతి బంతినీ సిక్సర్ కొట్టాలన్న ఆలోచనలు మానుకొని బేసిక్స్‌మై దృష్టి పెట్టాలి. ఈ ముగ్గురు భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో తొందరగా ఔటవుతుండటంతో ఆతర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఎంత జాగ్రత్తగా ఆడినా సత్ఫలితాలు రావడం లేదు. నితీశ్ రెడ్డి కూడా ప్రతి బంతిని సిక్సర్‌గా మలచాలన్న దృక్పథాన్ని మానుకోవాలి.
క్లాసెన్ లేటుగా బరిలోకి దిగుతుండటంతో ఆశించినంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అనికేత్ వర్మ మిడిలార్డర్‌లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. కమిందు మెండిస్ బౌలర్‌గా పనికొచ్చినా అతన్ని నిఖార్సైన టీ20 ఆల్‌రౌండర్ అనలేము. కమిన్స్ బౌలర్‌గా ప్రతి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. షమీ గత మ్యాచ్‌లో (కేకేఆర్) పర్వాలేదనిపించినా ఆ ముందు మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయాడు. హర్షల్ పటేల్, సిమర్‌జీత్ సింగ్ అంతంతమాత్రంగా ఉన్నారు. టీ20 స్పెషలిస్ట్ ఆడమ్ జంపా తొలి రెండు మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పక్కన పెట్టారు.
ఆల్‌రౌండర్ల ట్యాగ్‌తో ఉండే ట్రవిస్ హెడ్, నితీశ్ రెడ్డి, అభిషేక్ శర్మకు అస్సలు బౌలింగే ఇవ్వడం లేదు. లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వియాన్ ముల్దర్ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నేటి మ్యాచ్‌లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోతే సన్‌రైజర్స్‌కు ఇబ్బందులు తప్పవు. బ్యాటింగ్ శైలిని మార్చుకోవాలని టాప్-3 బ్యాటర్లకు చెప్పాలి. ప్రతిసారి బ్యాటర్లతోనే నెట్టుకురావాలంటే కష్టమని బౌలర్లకు గట్టి మెసేజ్ పంపాలి. మొత్తంగా వై నాట్ 300 అనే అలోచనను తీసి వేయాలి.