
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఐర్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
వెల్లింగ్టన్ మసకద్జ (35), బ్రియాన్ బెన్నెట్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్ కర్రన్ (18), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (4), జోనాథన్ క్యాంప్‌బెల్ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు, కర్టిస్ క్యాంఫర్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్, జాషువ లిటిల్, ఆండీ మెక్‌బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.
246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (89), వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ క్యాంఫర్ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్ టక్కర్ (36 నాటౌట్), జార్జ్ డాక్రెల్ (20 నాటౌట్) ఐర్లాండ్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది.