
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అనుహ్య ఓటమి చవిచూసింది. సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో ఢిల్లీపై రాజస్తాన్ పై చేయి సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడానికి సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో రాజస్తాన్ రాయల్స్ తొలుత రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్‌లను బ్యాటింగ్ పంపింది. పరాగ్ ఔటైన తర్వాత జైశ్వాల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్తాన్ సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్రమే చేసింది. ఆ రెండు వికెట్లు కూడా రనౌట్ల రూపంలో వచ్చినివే కావడం గమానార్హం.
అయితే 51 పరుగులతో క్విక్ ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రాణాను సూపర్ ఓవర్‌లో రాజస్తాన్ మెనెజ్‌మెట్ బ్యాటింగ్‌కు పంపించకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. హెట్‌మైర్ స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మళ్లీ అతడినే ఎందుకు బ్యాటింగ్‌కు పంపించారని రాజస్తాన్ మెనెజ్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. తాజాగా సూపర్ ఓవర్‌లో తను బ్యాటింగ్‌కు రాకపోవడంపై నితీష్ స్పందించాడు.
"హెట్‌మైర్, పరాగ్‌లను బ్యాటింగ్ పంపించాలన్నది ఎవరో ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. జట్టు మెనెజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం అది. కోచ్‌లతో పాటు కెప్టెన్, ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అందరూ ఆలోచించే వారిని బ్యాటింగ్‌కు పంపించారు. అదే షిమ్రాన్ హెట్మైర్ రెండు సిక్సర్లు కొట్టి ఉంటే, మీరు ఈ ప్రశ్న నాకు అడిగి ఉండరు. నా దగ్గర వేరే సమాధానం లేదు కూడా.
మేము తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సరైనదే. హెట్‌మైర్ మా ఫినిషర్. గతంలో అతడు ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు. మేము సూపర్ ఓవర్‌లో గెలిచి ఉంటే మీ ప్రశ్న కాస్త భిన్నంగా ఉండేది. క్రికెట్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.
సందీప్ శర్మ గతంలో సూపర్ ఓవర్‌లో బాగా బౌలింగ్ చేశాడు. ఈ సారి కూడా అందుకే అతడికి బంతిని ఇచ్చాము. ఏదేమైనప్పటికి సూపర్ ఓవర్‌లో నాలుగు నుంచి ఆరు పరుగులు అదనంగా సాధించి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాణా పేర్కొన్నాడు.
చదవండి: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'