
ఐపీఎల్-2025 (IPL 2025) సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో తొలిసారి కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు రజత్ పాటిదార్ (Rajat Patidar). విశేష ఆదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు సారథిగా ఎంపికైన అతడు.. తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు.
రజత్ పాటిదార్ సారథ్యంలో సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. అనంతరం.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 2008 తర్వాత తొలిసారి చెపాక్‌లో ఓడించింది.
సొంత మైదానంలో ఇంత వరకు గెలవలేదు
అయితే, ఇతర వేదికలపై సత్తా చాటిన ఆర్సీబీ సొంత మైదానంలో మాత్రం తేలిపోతోంది. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన పాటిదార్ సేన.. తర్వాత వాంఖడేలో ముంబై ఇండియన్స్‌ను ఓడించి తిరిగి గెలుపు బాట పట్టింది.
తర్వాత మళ్లీ పాత కథే. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. అనంతరం జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఆఖరిగా.. మరలా చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది.
ఈ క్రమంలో ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో గెలిచి.. ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ నాలుగింట గెలిచింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప రజత్ పాటిదార్ గురించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా రాణిస్తున్న పాటిదార్ పేరు.. టీమిండియా కెప్టెన్సీ రేసులోనూ వినిపిస్తుందని అంచనా వేశాడు.
టీమిండియా కెప్టెన్సీ రేసులో
‘‘ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో రజత్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ముచ్చటేస్తోంది. నాయకుడిగా గొప్ప పరిణతి కనబరుస్తున్నాడు. సొంతగడ్డపై ఎలా గెలవాలన్న అంశంపై అతడు మరింత దృష్టి సారించాల్సి ఉంది.
ఒకవేళ పాటిదార్ ఇలాగే తన విజయపరంపరను కొనసాగిస్తే.. త్వరలోనే టీమిండియా క్రికెట్ కెప్టెన్ గురించి జరిగే చర్చల్లో ముందుగా అతడి పేరే వినిపిస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.
జట్టులో చోటే లేదే!
కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల రజత్ పాటిదార్ 2023లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. గతేడాది టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. కానీ టీ20లలో మాత్రం అతడికి ఇంత వరకు భారత్ తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక మూడు టెస్టుల్లో 63, ఒక వన్డేలో 22 పరుగులు చేశాడు పాటిదార్.
అయితే, ఐపీఎల్‌లో కూడా ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా 1008 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాలో చోటుకే నోచుకోవడం లేని పాటిదార్ పేరు కెప్టెన్సీ రేసులో ఊహించడమే కష్టం. అలాంటిది రాబిన్ ఊతప్ప మాత్రం ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
చదవండి: Vaibhav Suryavanshi: యువీ- లారా కలిస్తే అతడు.. చిన్న పిల్లాడు కాదు.. చిచ్చర పిడుగు