
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో (National Games) తెలంగాణ (Telangana) ఖాతాలో పదో పతకం చేరింది. సోమవారం జరిగిన టేబుల్ టెన్నిస్ (Table Tennis) (టీటీ) టీమ్ ఈవెంట్‌లో తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. సూరావజ్జుల స్నేహిత్, అలీ మొహమ్మద్, మొహమ్మద్ అలీ, స్వర్ణేందు చౌధురీ, సంతోష్ రమేశ్ కుమార్‌లతో కూడిన తెలంగాణ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ 0–3తో పరాజయం పాలైంది.
తొలి మ్యాచ్‌లో స్నేహిత్ 6–11, 7–11, 9–11తో జశ్ మోదీ చేతిలో... రెండో మ్యాచ్‌లో మొహమ్మద్ అలీ 9–11, 9–11, 6–11తో రీగన్ చేతిలో... మూడో మ్యాచ్‌లో స్వర్ణేందు చౌధురీ 12–10, 1–11, 9–11, 3–11తో చిన్మయ సోమయ్య చేతిలో ఓడిపోయారు.
మరో సెమీఫైనల్లో తమిళనాడు 2–3తో పశి్చమ బెంగాల్ చేతిలో పరాజయం చూవిచూసి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పశి్చమ బెంగాల్ 3–0తో మహారాష్ట్రపై నెగ్గి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలోనూ పశి్చమ బెంగాల్ జట్టుకే స్వర్ణ పతకం లభించింది.
సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, పొయ్‌మంతీ బైస్యా, మౌమా దాస్, మౌహిత దత్తాలతో కూడిన పశ్చిమ బెంగాల్ ఫైనల్లో 3–0తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం క్రీడలు ముగిశాక తెలంగాణ 10 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 7 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది.