‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్‌ క్యాంపులో విభేదాలు? | Is There Rift in RR Camp Sanju Dravid Not on the Same Page Rumours Viral Why | Sakshi
Sakshi News home page

‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్‌ క్యాంపులో విభేదాలు?

Published Fri, Apr 18 2025 2:02 PM | Last Updated on Fri, Apr 18 2025 3:26 PM

Is There Rift in RR Camp Sanju Dravid Not on the Same Page Rumours Viral Why

Photo Courtesy: BCCI

రాజస్తాన్‌ రాయల్స్‌ నాయకత్వ బృందంలో విభేదాలు తలెత్తాయా?.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid)- కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) మధ్య సఖ్యత కొరవడిందా?.. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయా?’.. అంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌  సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అవుననేందుకు ఆస్కారం ఇస్తున్నాయి.

ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. సీజన్‌ ఆరంభానికి ముందే హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌ గాయపడ్డాడు. అయినప్పటికీ వీల్‌చైర్‌లో కూర్చునే జట్టుకు మార్గదర్శనం చేస్తున్నాడు.

మరోవైపు.. ఐపీఎల్‌ ఆరంభానికి ముందు కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కూడా గాయం కారణంగా చాలా కాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు అతడు కేవలం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నాడు. సారథిగా, వికెట్‌ కీపర్‌గా జట్టు అతడి సేవలను కోల్పోయింది.

ఇక సంజూ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌ వచ్చిన రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) సారథ్యంలో.. మూడు మ్యాచ్‌లలో రాజస్తాన్‌ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. అయితే, సంజూ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ క్రమంలో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్స్‌ తలపడింది.

అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సరిగ్గా 188 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. ఈ క్రమంలో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఢిల్లీ రాయల్స్‌ను ఓడించి గెలుపు జెండా ఎగురవేసింది. కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా సంజూ పక్కటెముకల నొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఇదిలా ఉంటే.. సూపర్‌ ఓవర్‌ సమయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తీసుకున్న నిర్ణయం క్రికెట్‌ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. రియాన్‌ పరాగ్‌తో పాటు షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ను రాయల్స్‌ బ్యాటింగ్‌కు పంపింది. వీరిద్దరు రనౌట్‌ అయి ఐదు బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యారు.

 

PC:  BCCI
నిజానికి ఈ మ్యాచ్‌లో నితీశ్‌ రాణా అద్భుత అర్ధ శతకం (28 బంతుల్లో 51)తో రాణించాడు. కానీ మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడిని సూపర్‌ ఓవర్లో పంపలేదు. ఇక సూపర్‌ ఓవర్‌కు ముందు ద్రవిడ్‌ డగౌట్‌లో తన సహాయక సిబ్బంది, ఆటగాళ్లతో ప్రణాళికల గురించి చర్చించాడు.

ఆ సమయంలో కెప్టెన్‌ సంజూ మాత్రం తనకు ఈ విషయం పట్టనట్లుగా ఆటగాళ్ల వెనుక అటూ ఇటూ తిరిగాడు. మధ్యలో సహచర ఆటగాడు రమ్మని పిలిచినా తనకు ఇష్టం లేదన్నట్లుగా వద్దంటూ చేతితో సైగ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే రాయల్స్‌ క్యాంపులో విభేదాలు అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. ఇది చూసిన సంజూ అభిమానులు ద్రవిడ్‌కు సంజూ నచ్చడని.. అందుకే ఇక్కడా తనకు సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌-2025లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌ కేవలలం రెండే గెలిచింది.

చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్‌.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement