
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్(Pakistan) కథ ముగిసిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై మరో మ్యాచ్ మిగిలూండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది.
ఈ క్రమంలో పాక్ జట్టు గ్రూపు స్టేజీలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. యావత్తు పాకిస్తాన్ మొత్తం వారి క్రికెట్ జట్టు ప్రదర్శనపై మండిపడుతోంది. మాజీ క్రికెటర్లు అయితే పాక్ జట్టును ఏకిపారేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్(Wasim Akram) రిజ్వాన్ సేనపై విమర్శల వర్షం కురిపించాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు సరైన డైట్ కూడా పాటించలేదని అక్రమ్ మండిపడ్డాడు.
"పాకిస్తాన్ ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌గా లేరు. సరైన డైట్ కూడా పాటించడం లేదు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆటగాళ్ళ కోసం ఒక ప్లేట్ నిండా అరటిపండ్లు ఉండడం చూశాను. కోతులు కూడా ఇన్ని అరటిపండ్లు తినవు. అవి వాటికి ఆహారం అయినప్పటికి అతిగా తినవు.
కానీ మా ప్లేయర్లు మాత్రం కోతులు కంటే ఎక్కువగా తింటున్నారు. ఈ చెత్త ప్రదర్శన కనబరిచినందుకు జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. క్రికెట్ ఎంతో ముందుకు వెళ్తున్నప్పటికి మా జట్టు మాత్రం ఇంకా గతంలో ఆడినట్లే ఆడుతోంది.
అది మారాలి. ఫియర్ లెస్ క్రికెటర్లు, యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురండి. ప్రస్తుత జట్టులో కచ్చితంగా ఐదు, ఆరు మార్పులు చేయాలి. ఇప్పటికైనా మీ తప్పులను మీరు తెలుసుకుంది.టీ20 ప్రపంచకప్-2026 కోసం జట్టును సిద్దం చేయండి" అంటూ అక్రమ్ ఓ క్రికెట్ షోలో పేర్కొన్నాడు. ఇక పాకిస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
చదవండి: IML 2025: సచిన్, యువీ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్