
బ్రిడ్జ్‌టౌన్: వచ్చే నెలలో జరిగే మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే వెస్టిండీస్ జట్టును విండీస్ బోర్డు ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైనట్లు తెలిపింది. కాగా భారత్‌లో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ సందర్భంగా డాటిన్ గాయపడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో డాటిన్ విండీస్ తరఫున టాప్ స్కోరర్(ఐదు మ్యాచ్‌లలో కలిపి 120 పరుగులు)గా నిలిచింది. ఇక తాజా వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడే పదిహేను మంది సభ్యులతో కూడిన వెస్టిండీస్ జట్టుకు.. మరో ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ నాయకత్వం వహిస్తుంది. ఏప్రిల్ 9 నుంచి 19వ తేదీ వరకు పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది.
ఈ టోర్నీలో వెస్టిండీస్‌తో పాటు పాకిస్తాన్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబరు–అక్టోబర్‌లలో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.
ఇదిలా ఉంటే.. డియాండ్ర డాటిన్ మహిళల ప్రీమియర్ లీగ్-2025లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను గుజరాత్ ఏకంగా రూ. 1.70 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే, ముంబై ఇండియన్స్ వుమెన్ టీమ్‌తో కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు డాటిన్ గాయపడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడి ఇంటిబాట పట్టగా.. ముంబై ఫైనల్‌కు చేరి రెండోసారి చాంపియన్‌గా అవతరించింది.
వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెర్మయిన్ క్యాంప్‌బెల్, అలియా అలెన్, అఫీ ఫ్లెచర్, చెర్రీ ఆన్ ఫ్రేజర్, షబీకా గజ్నబీ, జనీలియా గ్లాస్గో, చినెల్లీ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసార్, కరిష్మా రాంహరాక్, స్టెఫానీ టేలర్, రషాదా విలియమ్స్.