
వినండి సారూ.. వెతలు తీర్చాలి మీరు
భూసేకరణను ఆపాలి
నెల్లూరు రూరల్: మా గోడు వినమంటూ అర్జీదారులు కలెక్టరేట్‌కు పోటెత్తుతున్నారు. వారం వారం అర్జీలు సంఖ్య పెరుగుతోంది. ఈ సోమవారం అయితే ఏకంగా ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 583 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ ఆనంద్‌తోపాటు డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌రావు, డ్వామా పీడీ గంగాభవాని, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూకు సంబంధించి 245, మున్సిపల్ శాఖకు సంబంధించి 39, సర్వేకు 51, పంచాయతీరాజ్ శాఖకు 43, పోలీసు శాఖకు సంబంధించి 94 అర్జీలు అందాయి.
భూమి ఆక్రమించారు
నెల్లూరురూరల్ మండలంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కొత్తూరు బిట్–2లో సర్వే నబర్లు 2173, 2174లో కండలేరు ముంపువాసులకు 2021లో 150 మందికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఈ స్థలాల్లోని బావులను పూడ్చేసి ఈ మధ్య కొందరు ఆక్రమించారని, ఆ కాలనీవాసులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై పలు మార్లు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో పట్టించుకో వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసి రమేష్‌రెడ్డి కోరారు.
ఇంటి పన్ను పేరుతో అధికంగా వసూలు
మా ఇంటికి సంబంధించి పన్ను రూ.10 వేలు గత నెల 15వ తేదీన గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శికి చెల్లించానని, మరో రూ.2 వేలు ఫోన్‌పే చేయించుకున్నారని, కానీ తనకు రూ.1,423 మాత్రమే బిల్లు ఇచ్చారని, దీనిపై అడిగితే సమాధానం చెప్పడం లేదని బోగోలుకు చెందిన దుగ్గిరాల రోజ్‌మేరి అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వారం వారం వెల్లువెత్తుతున్న వినతులు
ఈ వారం ప్రజాసమస్యల పరిష్కార
వేదికకు 583 అర్జీలు
కావలి మండలం ఆనెమడుగు, సర్వాయపాళెం మజారా గ్రామాల్లో దాదాపు 750 ఎకరాల భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చా రని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య పేర్కొన్నారు. ఆ భూములు తీసుకుంటే సుమారు 1200 కుటుంబాల ప్రజలకు జీవనోపాధి పోతుందన్నారు. ప్రధానంగా గీత వృత్తి కార్మికుల జీవనభృతి పోతే ఎలా బతకాలన్నారు. భూములు అప్పగించాలంటే గ్రామ సభల్లో 80 శాతం మంది ప్రజలు ఆమోదం కావాలన్నారు. ఇదంతా వదిలేసి ఫిబ్రవరిలో ఒక షెడ్యూల్, మార్చిలో ఒక షెడ్యూల్ ప్రకటించారన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు భూములు కట్టబెట్టాలని చూడడం దారుణమన్నారు. తక్షణమే భూసేకరణ ఆపాలని గ్రామస్తులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

వినండి సారూ.. వెతలు తీర్చాలి మీరు