
నా మాటంటే విలువ లేదా?
● దివ్యాంగుడికి ట్రై సైకిల్ ఇచ్చి
తీసేసుకుంటారా
● ఫొటోకు ఫోజులివ్వడానికేనా
● సమగ్ర శిక్ష అధికారులపై
జెడ్పీ చైర్‌పర్సన్ అసహనం
నెల్లూరు(పొగతోట): ‘ఓ దివ్యాంగుడికి ట్రై సైకిల్ ఇవ్వాలని సమగ్ర శిక్ష జిల్లా అధికారులకు చెప్పాను. వాళ్లు దానిని అందించి ఫొటోలు తీసుకున్నారు. మళ్లీ ఆ సైకిల్‌ను వెనక్కు తీసేసుకున్నారు. అధికారులకు నా మాటంటే విలువ లేదా?, ఆ మాత్రానికి ఇస్తామని చెప్పడం ఎందుకు?, అవమానించడం ఎందుకు?’ అని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. గురువారం నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. ఇందులో అరుణమ్మ మాట్లాడారు. అధికారులు ట్రై సైకిల్ ఇచ్చి ఫొటోలకు ఫోజులిచ్చి అనంతరం దానిని తిరిగి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చైర్‌పర్సన్ ఇచ్చిన మాటకే విలువ లేకుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమావేశాలకు రావడం, పేపర్లలో ఉన్నది చదివి వినిపించి వెళ్లిపోవడం జరుగుతోందన్నారు. మా మాటలకు విలువలేని దానికి సమావేశాలు నిర్వహించడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లిగూడూరు మండలంలో శిఽథిలావస్థలో ఉన్న పాఠశాలను త్వరగా కూల్చేయాలని ఆదేశించారు. ఐసీడీఎస్‌కు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నిర్మాణాలు పూర్తి చేయాలి
వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు సచివాలయ, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ఉపాధి హామీకి సంబంధించి రెండు నెలలకు పైగా పనులు చేసిన కూలీలకు వేతనాలు అందలేదన్నారు. చైర్‌పర్సన్ స్పందిస్తూ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. వాటర్ ట్యాంక్‌లను సకాలంలో శుభ్రం చేస్తూ నీటిని విడుదల చేయాలని తెలిపారు. పొదుపు గ్రూపు మహిళలకు సకాలంలో రుణాలు అందించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అర్హులైన వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.