
మా భూములిచ్చే ప్రసక్తే లేదు
● సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద
కరేడు గ్రామస్తుల ధర్నా
కందుకూరు: ‘ప్రభుత్వం మా జీవనాధారమైన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములిచ్చే ప్రసక్తే లేదు’ అని కరేడు గ్రామస్తులు అన్నారు. బీపీసీఎల్, సోలార్ ప్లాంట్ల కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ సారవంతమైన భూములను తీసుకుంటే ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వెంటనే భూసేకరణ ప్రక్రియను నిలిపి వేయాలన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎస్‌ఏ గౌస్ మాట్లాడుతూ గతంలో అనేక ప్రాంతాల్లో భూసేకరణ చేశారని, ఇప్పటివరకు నిర్వాసితులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని వివరించారు. అనంతరం సబ్‌కలెక్టర్ తిరుమణి శ్రీపూజను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కుంకాల రామసుబ్బారెడ్డి, దారం శ్రీనివాసులు, కె.రమణయ్య, లింగారెడ్డి రామకోటిరెడ్డి, గంజి రామకోటయ్య, సీపీఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్, ఎస్‌కే మున్వర్ సుల్తానా, నాదెండ్ల కోటేశ్వరరావు, ఎస్‌కే మల్లిక, ఎం.పద్మ, ఎస్.పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.