దళితులపై కేసులు ఎత్తేయాలంటూ ధర్నా | - | Sakshi
Sakshi News home page

దళితులపై కేసులు ఎత్తేయాలంటూ ధర్నా

Apr 21 2025 11:55 PM | Updated on Apr 21 2025 11:55 PM

దళితులపై కేసులు ఎత్తేయాలంటూ ధర్నా

దళితులపై కేసులు ఎత్తేయాలంటూ ధర్నా

నెల్లూరు(అర్బన్‌): సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూస్వాములపై చర్యలు చేపట్టి, దళితులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని అఖిల భారత రైతు – కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డీపీ పోలయ్య డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన పలువురు దళితులు సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోలయ్య మాట్లాడుతూ సర్వే నంబర్‌ 356, 359లో 400 ఎకరాల ప్రభుత్వ భూములను పెత్తందారులు ఆక్రమించారన్నారు. ఇందుకు తహసీల్దార్‌, మైనింగ్‌ అధికారులు సహకరించారన్నారు. సెంటు భూమిలేని నిరుపేద దళితులు కూడా ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్నారన్నారు. అయితే వారిపై మైనింగ్‌, రెవెన్యూ అఽధికారులు కలిసి కేసులు పెట్టారని తెలిపారు. కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. వెంకటకృష్ణ మైనింగ్‌ కంపెనీ 359 సర్వే నంబర్‌లో 60 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజు కోసం దరఖాస్తు చేసిందన్నారు. ఆ కంపెనీకి ఈసీ కూడా ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. ఆ సర్వే నంబర్‌లో భూమిని సాగు చేస్తున్న దళితులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. గతంలో కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇవ్వగా న్యాయం చేసేందుకు పూనుకున్నారన్నారు. అయితే రాజకీయ నేపథ్యంలో తహసీల్దార్‌ అక్రమాలకు పాల్పడుతున్నాడన్నారు. జిల్లా సర్వేయర్‌ ద్వారా సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి బంజరు, మిగులు, పోరంబోకు భూములను దళితులకు పంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రమేష్‌, ప్రగతి శీల మహిళా సంఘం నాయకులు మమత, నాగమణి, వెంకటరమణమ్మ, సంఘం నాయకులు కోటయ్య, శ్రీను, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement