వణుకుతున్న తీర గ్రామాలు | - | Sakshi
Sakshi News home page

వణుకుతున్న తీర గ్రామాలు

Published Mon, Apr 21 2025 11:55 PM | Last Updated on Mon, Apr 21 2025 11:55 PM

వణుకు

వణుకుతున్న తీర గ్రామాలు

సముద్ర మట్టానికి కంటే

తక్కువ లోతులో ఇసుక తవ్వేసిన దృశ్యం

సముద్రపు ఇసుకనూ వదలని తమ్ముళ్లు

చెలియకట్టలు ధ్వంసం చేస్తున్న వైనం

మత్స్యకార గ్రామాలు, పోర్టు,

హార్బర్‌లకు పెనుముప్పు

సాక్షి ప్రతినిఽధి నెల్లూరు: జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో 140 కి.మీ. వరకు తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఆ తీరం వెంబడి 98 మత్స్యకార గ్రామాలున్నాయి. సముద్రంలో చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకార గ్రామాల వినాశనానికి టీడీపీ నేతలు తెగించారు. ప్రధానంగా కావలి, కందుకూరు నియోజకవర్గాల్లోని సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఇసుక కోసం మత్స్యకారుల జీవితాలనే పణంగా పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో వారి అనుచరవర్గం బరితెగించి ప్రకృతితోనే చెలగాటం ఆడుతోంది.

‘ఇసుక మేట దిబ్బలు’ తవ్వేసి..

తీరం వెంబడి సముద్రపు అలలు తాకే ప్రాంతంలో వేసే ఇసుక మేట దిబ్బ (చెలియకట్ట)ను తవ్వేసి ఇసుకాసురులు అక్రమ రవాణా సాగిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని టెక్కాయచెట్లపాళెం నుంచి అలగాయపాళెం తీరం వరకు, కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట పంచాయతీ కొత్తసత్రం, అన్నగారిపాళెం పంచాయతీ ఒట్టూరు, లక్ష్మీపురం పరిధి తీర ప్రాంతంలో జేసీబీలను ఏర్పాటు చేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళల్లో ఈ ఇసుకను తరలిస్తున్నారు. హేచరీలు, పరిశ్రమల నిర్మాణం, అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో బేసిమట్టం మధ్యలో ఎత్తులేపడానికి ఈ ఇసుకను తరలిస్తున్నారు. లవణ స్వభావం ఉండే ఈ ఇసుకను వాడడం వల్ల నిర్మాణాల మనుగడకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

ఇసుక కోసం సముద్ర తీరం ధ్వంసం అవుతున్నా.. అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మత్స్య, అటవీశాఖలకు సంబంధించిన అధికారులెవరూ ఇసుక అక్రమ రవాణా విషయాన్ని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. చెలియకట్ట రెవెన్యూశాఖ పరిధిలో ఉంటుంది. ఈ భూమిలో మొక్కలు నాటి పెంచే బాధ్యత అటవీశాఖది. తీరం కాపాడడం మత్స్యశాఖ బాధ్యత. వీరందరూ తమ బాధ్యతలను మరిచిపోయారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపు జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తీరప్రాంత భద్రత కోసం ఏర్పాటు చేసిన కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ వ్యవస్థ సైతం తీరం ధ్వంసం అవుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

రామాయపట్నం,

జువ్వలదిన్నె హార్బర్‌కు పెనుముప్పు

పారిశ్రామికంగా అభివృద్ధితోపాటు మత్స్యకారులు జీవితాల్లో వెలుగులు నింపే రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్‌తోపాటు మత్స్యకార గ్రామాలకు భవిష్యత్‌ కాలంలో పెనుముప్పు వాటిల్లే పరిణామాలు కనిపిస్తున్నాయి. రూ.288 కోట్లతో వైఎస్సార్‌సీపీ హయాంలో జువ్వలదిన్నె హార్బర్‌ నిర్మాణం పూర్తి చేశారు. ఆ నిర్మాణ కాంట్రాక్టర్‌గా స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించారు. హార్బర్‌ నిర్మాణంలో కూడా సముద్రపు ఇసుక వాడారన్న అనుమానాలు లేకపోలేదు. ఆ పనులపై ఇప్పటికి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా..

సముద్ర తీరంలో ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌ ఆనంద్‌కు జాతీయ మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నపూడి తాతారావు ఇటీవల ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఇప్పటికై నా కలెక్టర్‌ సముద్ర ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మత్స్యకార గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

తమ్ముళ్ల ధనాశ.. తీరం వినాశనానికి దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సహజ వనరుల దోపిడీతోపాటు ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. అల్పపీడనాలు, వాయుగుండాలు, సునామీ వంటి విపత్తుల్లో రాకాసి అలలను అడ్డుకునే ‘ఇసుక దిబ్బ’ (చెలియకట్ట)లను సముద్ర ఇసుక కోసం తవ్వేస్తుండడంతో భవిష్యత్‌లో ప్రళయాలు సంభవించే అవకాశం లేకపోలేదు. కావలి, కందుకూరు నియోజకవర్గాల్లో కడలి తీరం విధ్వంసంతో రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె పిషింగ్‌ హార్బర్‌తోపాటు మత్స్యకార గ్రామాలకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీరాన్ని ధ్వంసం చేసి భారీగా ఇసుక తరలిస్తుండంతో భారీ ముప్పు పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికల నేపథ్యంలో తీర గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సముద్ర మట్టం కన్నా ఎక్కువ ఎత్తుగా ఉండే ఈ భూమి నుంచి ఇసుకను సముద్ర మట్టం కన్నా తక్కువ చేయడం వల్ల సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాల సమయంలో గాలులు విసురుగా వీచినప్పుడు సముద్రంలోని అలలు గ్రామాలపైకి చేరి ముంచెత్తే అవకాశం ఉంది. 2004 డిసెంబర్‌ 26న వచ్చిన ‘సునామీ’ తీర గ్రామాలను వణికించింది. చాలా గ్రామాలను ఈ చెలియకట్టలే కాపాడాయి. గతంలో సముద్రానికి, మత్స్యకార గ్రామాల మధ్య ఇసుక తిన్నెలతోపాటు అటవీశాఖ నాటిన చెట్లు అధికంగా ఉండడం వల్ల నీరు పొంగినా గ్రామాలపైకి చేరే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇసుక తిన్నెలు, చెట్లు కనుమరుగు కావడం వల్ల సముద్రం మట్టంతో గ్రామాలు సమానంగా చేరడం వల్ల పెను ముప్పు వాటిల్లే పరిణామాలు ఉన్నాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

వణుకుతున్న తీర గ్రామాలు 
1
1/1

వణుకుతున్న తీర గ్రామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement