గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

గుట్టు రట్టు

Published Sun, Apr 27 2025 12:30 AM | Last Updated on Sun, Apr 27 2025 12:30 AM

గుట్ట

గుట్టు రట్టు

సైబర్‌ ముఠా

నెల్లూరు(క్రైమ్‌): షేర్స్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.కోట్లు దోచేస్తున్న అంతర్‌ రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల నగదు, 50 మొబైల్స్‌, ఏటీఎం కార్డులు, ప్రింటర్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.39.40 లక్షల నగదును ఫ్రీజ్‌ చేశారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫెరెన్స్‌ హాలులో ఎస్పీ జి.కృష్ణకాంత్‌ నిందితుల వివరాలను శనివారం వెల్లడించారు. నగరంలోని పొగతోటకు చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు సంబంధించిన లింక్‌రాగా క్లిక్‌ చేసింది. వెంటనే ఆమె వాట్సాప్‌ నంబర్‌కు నిషాబసు అనే మహిళ మెసేజ్‌ చేసి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు సంబంధించి సూచనలు, సలహాలిచ్చి లాభాలు వచ్చేటట్లు చేస్తామని నమ్మబలికి బాధిత మహిళచే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించింది. షేర్ల కొనుగోలుకు కొంత మొత్తం పెట్టుబడి పెట్టించి ఆదాయం వచ్చేలా చేసి ఆమెను నమ్మించింది. సదరు మహిళ అప్పుచేసి ఈ ఏడాది జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు పలు దఫాలుగా రూ.2,46,30,396 డిపాజిట్‌ చేశారు. వారు అకౌంట్‌లో రూ.4,02,24,759 నగదు ఉన్నట్లు ఆమెకు చూపించారు. ఆ నగదు డ్రా చేసేందుకు యత్నించగా అవి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు గతనెల 9వ తేదీన చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. బాధిత మహిళ డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులు రాజస్థాన్‌కు చెందిన రామారామ్‌, అతని అనుచరులైన గోగారామ్‌, హేమంత్‌కుమార్‌, కై లాష్‌, నాగారం, హైదరాబాద్‌కు చెందిన వీరేశ్వరరావు, ఎం.రవిలుగా గుర్తించి వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు నిందితులను ఈనెల 25న, మిగిలిన ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా మోసాలు వెలుగులోకి వచ్చాయి.

మోసాలు ఇలా..

రాజస్థాన్‌కు చెందిన రామారామ్‌ అతని అనుచరులు నాలుగు నెలల కిందట చైన్నెకు వచ్చారు. వీరంతా ఓ గదిని అద్దెకు తీసుకుని శివం మెటల్‌ కార్పొరేషన్‌, సూర్య ఇంపెక్స్‌ తదితర నకిలీ కంపెనీల పేర్లతో వివిధ బ్యాంకుల్లో కరెంట్‌ ఖాతాలు, ప్రధాన బ్యాంకులు కాకుండా చిన్న చిన్న బ్యాంకుల్లో క్షేత్రస్థాయిల్లో పరిశీలన ఉండని బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతాలు తెరిచారు. రోడ్ల పక్కన విక్రయించే సిమ్‌కార్డులు తీసుకుని వాటి ద్వారా నకిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డులు ఏర్పాటు చేసి ఆ నంబర్లకు అనుసంధానం చేశారు. ఈ మొత్తం ప్రక్రియకు అవసరమైన ప్రింటర్లు, ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్‌, కార్ట్‌ కటింగ్‌మిషన్‌, లామినేషన్‌ యంత్రం, స్మార్ట్‌ ఫోన్లు, కీప్యాడ్‌ ఫోన్లు తదితరాలను ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని అనేకమందిని నమ్మించి కోట్లు దోచేస్తున్నారు. ఇప్పటి వరకు నకిలీ గుర్తింపు కార్డులతో 236 బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 36 ఖాతాలపై ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో 436 ఫిర్యాదులు అందాయి. వారి వద్ద నుంచి రూ.2లక్షల నగదు, సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులు, ప్రింటర్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొందరు నిందితులు ఉన్నారని వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ తెలిపారు.

సిబ్బందికి అభినందన

సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేసిన చిన్నబజారు, సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌లు చిట్టెం కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, చిన్నబజారు ఎస్‌ఐలు అయ్యప్ప, రజాక్‌, ఏఎస్‌ఐ శ్రీహరి, హెచ్‌సీలు సురేష్‌బాబు, నజ్మల్‌, కానిస్టేబుల్స్‌ను, సైబర్‌ వింగ్‌ పీసీలను ఎస్పీ అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌజన్య, నగర డీఎస్పీ సింధుప్రియ, చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏడుగురు నిందితుల అరెస్ట్‌

రూ.2 లక్షల నగదు, మొబైల్స్‌ స్వాధీనం

బ్యాంకు ఖాతాల్లోని

రూ.39 లక్షలు ఫ్రీజ్‌

గుట్టు రట్టు 1
1/1

గుట్టు రట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement