
భారీగా పెరిగిన పెట్టుబడులు
రెండేళ్లుగా ఉన్న ధరలు చూసి పొగాకు రైతులు పెట్టుకున్న ఆశలు ఈ ఏడాది ఆవిరైపోతున్నాయి. కనీసం మద్దతు ధర కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వేలం ప్రారంభంలో ఉన్న ధరలే నెలన్నర తర్వాత కూడా కొనసాగుతున్నాయి. నాణ్యమైన పొగాకు ధరలు ఇలా ఉంటే.. ఇక లోగ్రేడ్ రకాల ధరలపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు.
కందుకూరు: జిల్లాలో పొగాకు రైతుల ఆశలు చిగురించే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది కంటే ఈ ఏడాది రూ.100–110 ధరలు తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 2024–25 ఏడాది పొగాకు సీజన్‌కు సంబంధించి మార్చి 10న వేలం ప్రక్రియ ప్రారంభమైంది. వేలం ప్రారంభ రోజున హైగ్రేడ్ కేజీ పొగాకు ధర రూ.280 కొనుగోలు చేయగా, దాదాపు నెలన్నర తర్వాత కూడా అదే ధరలు కొనసాగుతుండడం గమనార్హం. క్వింటా హైగ్రేడ్ పొగాకు ధర రూ.28,000 వరకు ఉంటే.. లోగ్రేడ్ రూ.20,000 కూడా కొనుగోలు చేయడం లేదు. ఇక సరాసరి ధర రూ.25,000 మాత్రమే వస్తుంది. అదే 2023–24 సీజన్‌లో పొగాకు రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. హైగ్రేడ్ పొగాకు క్వింటా రూ 36,000 పలకగా, సగటు ధర రూ.27,000 క్వింటాకు వచ్చింది. ప్రస్తుతం లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి ధరలు కోత వేస్తున్నారని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ
ప్రస్తుతం పొగాకు మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో అమ్ముకునేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ ధరలతో భారీగా నష్టపోతామని, మార్కెట్‌లో ధరలు వచ్చినప్పుడు అమ్ముకుందామనే ఉద్దేశంతో తమ వద్ద ఉన్న హైగ్రేడ్ పొగాకును కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేస్తున్నారు. కందుకూరు పరిసర ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజ్‌లన్నీ పొగాకు బేళ్లతో పూర్తిగా నిండిపోయాయి. అదే అదనుగా కోల్డ్ స్టోరేజ్ యజమానులు కూడా రెంట్ ధరలు పెంచారు. గతేడాది కోల్డ్ స్టోరేజ్‌లో ఒక బారు ధర రూ.25 వేలు ఉండగా, అది ఈ ఏడాది రూ.45 వేలకు పెంచేశారు. రైతులకు ఇది కూడా భారంగా మారే పరిస్థితి వచ్చింది.
నిరాశాజనకంగా పొగాకు మార్కెట్
కేజీ పొగాకు ధర
రూ.250 మించని వైనం
గతేడాదితో పోల్చితే భారీగా పతనం
నాణ్యమైన పొగాకు ధరలే ఇలా..
లోగ్రేడ్ రకాలపై రైతుల ఆందోళన
గతేడాది పొగాకు రైతులకు మంచి లాభాలు వచ్చాయి. దాంతో ఈ ఏడాది కూడా రైతులు భారీ స్థాయిలో సాగు చేపట్టారు. పొగాకు సాగుకు ఒక్కసారిగా డిమాండ్ రావడంతో బ్యారన్‌లు, పొలాల కౌలు ధరలు పెరిగాయి. కూలీలు, పెట్టుబడి ఖర్చులు కూడా పెరగడంతో ఒక బ్యారన్ పరిధిలో సాగుకు రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అయిందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం పొగాకు మార్కెట్‌లో ధరలు ఇదే విధంగా కొనసాగితే ఈ ఏడాది బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టం వచ్చే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. మున్ముందు ఇంకా రేట్లు పతనమైతే నష్టాలు మరింతగా పెరుగుతాయని, పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

భారీగా పెరిగిన పెట్టుబడులు