
హంతకులకు శిక్ష పడేలా చూడండి
పెనుకొండ రూరల్: రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య హత్య కేసులో పాల్గొన్న అందరి పేర్లు కేసులో నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె లింగమయ్య కుటుంబీకులతో కలిసి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్నను కలిశారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబీకులు హత్యకు దారితీసిన ఘటనల గురించి ఎస్పీకి వివరించారు. ఆరోజు జరిగిన హత్యాకాండలో చాలామంది పాల్గొన్నారని, పోలీసులు మాత్రం ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని ఎస్పీకి తెలిపారు. పోలీసులు కావాలనే పలువురి పేర్లు ఎఫ్‌ఐఆర్ నుంచి తొలగించారని ఉషశ్రీచరణ్ ఫిర్యాదు చేశారు. మరోసారి విచారించి అందరి పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఉషశ్రీచరణ్ వెంట వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు సుధాకర్ రెడ్డి, గజేంద్ర తదితరులు ఉన్నారు.
హత్యలో పాల్గొన్న
వారందరి పేర్లు చేర్చాలి
ఎస్పీ రత్నను కోరిన వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
బాధిత కుటుంబంతో కలిసి వెళ్లి
హత్య ఘటన వివరించిన వైనం