
రెడ్డప్పశెట్టి ‘పాలీహౌస్ సబ్సిడీ’పై విచారణ
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టి పాలీహౌస్‌ల పేరుతో అక్రమంగా రూ.కోట్లు లబ్ధిపొందడంపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘‘అక్రమాలు కోకొల్లలు’’ కథనంపై ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యానశాఖ అధికారి మహేష్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. ఆయా సంవత్సరాల్లో సబ్సిడీ పొందిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. రెడ్డెప్పశెట్టి ఎస్టేట్‌ను కూడా అధికారులు పరిశీలించి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక సబ్సిడీ ముసుగులో రెడ్డెప్పశెట్టి, ఆయన బృందం చేసిన ప్రజాధనం లూటీపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆయన అక్రమాలపైనే జోరుగా చర్చ జరిగింది. వామ్మో రూ.5.48 కోట్లు అవినీతి జరిగిందా..? అనే మాటలు సర్వత్రా వినపడ్డాయి. ఈ తరహా మోసాలు చూడటం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. ప్రజాధనం లూటీపై విచారణ జరపాలని నియోజకవర్గ ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.