
‘తమ్ముళ్ల’ తన్నులాట!
● రచ్చకెక్కిన భూ తగాదాలు
● సాలక్కగారి శ్రీనివాసులు రుబాబు
● మైలసముద్రం సుబ్రమణ్యంపై దాడి
● కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
కొత్తచెరువు: పుట్టపర్తి నియోజకవర్గంలో ‘తెలుగు తమ్ముళ్లు’ భూ తగాదా పోరు రచ్చకెక్కింది. రెండు రోజుల క్రితం కొత్తచెరువులో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ భూ తగాదాలో రౌడీషీటర్, టీడీపీ నాయకుడు సాలక్క గారి శ్రీనివాసులు తన అనుచరులతో కలిసి మైలసముద్రం సుబ్రహ్మణ్యంపై దాడి చేశాడు. బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే...
కొత్తచెరువు నుంచి పెనుకొండకు వెళ్లే మార్గంలో తిప్పాబట్లపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబరు 71–1లో మూడెకరాల పొలం ఉంది. ఆ పొలంపై బ్రాహ్మణులకు ఎలాంటి హక్కులు లేవు. కానీ బ్రాహ్మణుల నుంచి ఆ భూమి కొన్నట్లు సాలక్కగారి శ్రీనివాసులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మకానికి పెట్టాడు. భూమి కొనేందుకు సిద్ధమైన వ్యక్తి టీడీపీ నాయకుడు మైలసముద్రం సుబ్రహ్మణ్యంకు స్నేహితుడు కావడంతో భూమి కొనుగోలు విషయం చర్చకు రాగా.. అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో భూమి కొనదలచిన వ్యక్తి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనంతటికి మైలసముద్రం సుబ్రహ్మణ్యమే కారణమని భావించిన సాలక్కగారి శ్రీనివాసులు ఆగ్రహంతో ఊగిపోయాడు. శనివారం రాత్రి నాలుగు రోడ్ల కూడలిలోని అన్నపూర్ణ హోటల్‌లో ఉన్న సుబ్రహ్మణ్యం వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. తన భూమిని విక్రయించకుండా అడ్డుకుంటావా... అంటూ అంటూ సాలక్కగారి శ్రీనివాసులు, అతడి అనుచరులు దాడి చేశారు. దాడిలో గాయపడిన సుబ్రమణ్యం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.