
రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం
చైన్నె, శివారు జిల్లాల్లో 40 సెం.మీ వర్షం కురుస్తుందని అంచనా
స్కూళ్లకు నేడు సెలవు
ఐటీ సంస్థలకు వర్క్‌ఫ్రం హోంకు సూచన
ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం
మండలాలు, జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఐఏఎస్‌ల తిష్ట
అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో చైన్నె నగరం, శివారు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో మాదిరి మరోమారు ఈ ప్రాంతాలు వరద విలయంలో చిక్కకుండా ముందుజాగ్రత్త చర్యలను విస్తృతం చేశారు. మంగళవారం చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఐటీ సంస్థలు తమ సిబ్బంది ద్వారా ఆఫీసులలో కాకుండా, వర్క్ ఫ్రం హోం కేటాయించాలని సూచించారు. చైన్నె, శివారు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను మంత్రులు, ఐఏఎస్‌ల బృందం నిత్యం పర్యవేక్షిస్తోంది. పుదుచ్చేరి లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
సాక్షి, చైన్నె: ఉపరితల ఆవర్తనం రూపంలో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో చెదురు ముదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి క్రమంగా వరుణాగ్రహం తీవ్రమైంది. తొలుత మదురై, దిండుగల్, తిరుచ్చి జిల్లాలోనూ తర్వాత కోయంత్తూరు, ఈరోడ్ తదితర చోట్ల కుండపోతగా వర్షం పడింది. ఆదివారం రాత్రంతా అనేక జిల్లాలో వర్షాలు కొనసాగాయి. సోమవారం విల్లుపురం, కడలూరు, అరియలూరు,పెరంబలూరు తదితరప్రాంతాలలో అనేక చోట్ల వర్షం పడింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా బూదలూరులో 12 సెం.మీ వర్షం పడింది. వర్షాలతో తేని, మదురైలోని జలపాతాలు, వైగై జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగింది. కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలకు మే ట్టూరు జలాశయంలో కి సెకనుకు 17 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దిండుగల్‌లోని వరదమానది రిజర్వాయర్ నిండడంతో ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. మ దురై, దిండుగల్,కోయంబత్తూరులలోని లోతట్టు ప్రాంతాలలో చేరిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మదురైలో వర్షాలకు కోట్టం పట్టి వద్ద విద్యుత్ తీగ తెగి పడడంతో రైతు గణేషన్(50) మరణించాడు. పూంజుత్తి ప్రాంతానికి చెందిన రామచంద్రన్ (58) విద్యుదాఘాతానికి గురై బలయ్యాడు.నామక్కల్ తిరుచంగోడువద్ద తిరుమని ముత్తారునదిలో పాల వ్యాపారి పెరిస్వామి(63) మోటారు సైకిల్‌తో పాటు కొట్టుకెళ్లి మరణించాడు.
అల్పపీడన ప్రభావంతో..
బంగాళాఖాతంలో సోమవారం ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దక్షిణమధ్య బంగా ళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ ద్రోణి వా యువ్య దిశలో పయనించి మంగళవారం సెంట్రల్ బంగాళా ఖాతంలో వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో చైన్నె నగరం, శివారు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు డెల్టాలోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, మైలాడుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో అతిభారీ వర్షాలు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, వేలూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశాల ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చైన్నె, శివా రులలో ఒకే రోజు 20 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మూడు రోజులు సరా సరిగా 40 సెం.మీ వర్షం పడేందుకు అధిక అవకాశాలు ఉందన్న సమాచారంతో చైన్నె, శివారు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. శివారుల నుంచే అధిక నీరు నగరంలోకి రావడం, వరద ముంపు ఎదుర కావడం వంటి పరి ణామాలు గతంలో జరగడంతో ఈ సారి శివారు ప్రాంతాలపై మరింతగా అధికార యంత్రాంగం ఎక్కువ దృష్టి సారించింది. మంగళవారం చైన్నె, శి వారు జిల్లాలో స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ప్రైవేటు సంస్థల సిబ్బందికి వర్క్ ఫ్రంహోంకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
మంత్రుల ఉరుకుల.. పరుగులు
డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్, నగరాభివృద్ధి శాఖమంత్రి కేఎన్ నెహ్రూ, ఎంఎస్‌ఎంఈ మంత్రి అన్బరసన్, దేవదాయ మంత్రి శేఖర్‌బాబు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తదితరులు చైన్నె, శివారు జిల్లాల వైపుగా పరుగులు తీశారు. ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. జె. మేఘనాథరెడ్డి, సమీరన్, కుమర వేల్ పాండియన్, ఎస్ రామన్, శ్రేయ, కన్నన్, జాన్ వర్గీస్, విశాఖన్ తదితర ఐఏఎస్ అధికారులను మండలాల వారీగా రంగంలోకి దించారు. శివారులోని తాంబరంలో 19 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారు. శివారులతోపాటూ చైన్నెలో భారీ వర్షం కురిసినా నీరు సులభంగా సముద్రంలోకి వెళ్లే విధంగా ముఖద్వారం వద్ద పూడికతీత శరవేగంగా సాగుతోంది. ఇక్కడకు కొట్టుకు వచ్చే చెత్త చెదారాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాలలో ముందు జాగ్రత్తలతో పాటు ఇక్కడి ప్రజల కోసం శిబిరాలను సిద్ధం చేశారు. చైన్నెలో 18 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, మరో 16 పోలీసు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా చైన్నె శివారులలోని వేళచ్చేరి పరిసరాలలోని లోతట్టు ప్రాంతవాసులు ముందు జాగ్రత్తగా తమ కార్లను సమీపంలోని వంతెనల మీద పార్క్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని పాఠశాలలలో పరిస్థితులు, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ కన్నన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అలాగే అన్ని ఆస్పత్రులలో మందులు పుష్కలంగా ఉండాలని, వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎంసుబ్రమణియన్ ఆదేశించారు. వండలూరు, గిండిలలోని పార్కులలో ఉన్న పక్షలు, వన్య ప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈశాన్య రుతు పవనాల అలర్ట్ చేస్తూ, ముందు జాగ్రత్తల విస్తృతంపై సీఎస్ మురుగానంద్ లేఖ రాశారు.
అత్యవసర సేవల నంబర్లు ఇవే..
అతి భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవలకు గాను చైన్నె కార్పొరేషన్ యంత్రాంగం హెల్ప్‌లైన్ నం బర్లను ప్రకటించింది. మండలాల వారీగా అఽధికారులు, వారి సెల్ నెంబర్లను విడుదల చేసింది.
ప్రాంతం అధికారి సెల్ నంబరు
తిరువొత్తియూరు బాబు 94445 90102
మనలి గోవిందరాజు 94445 90002
మాదవరం తిరుమురుగన్ 94445 90003
తండయార్ పేట శరవన్ ముర్తి 94445 90004
రాయపురం ఫరీదా బాబు 94445 90005
తిరువీకానగర్ మురగన్ 94445 90006
అంబత్తూరు తమిళ్ సెల్వన్ 94445 90007
అన్నానగర్ సురేష్ 94445 90008
తేనాంపేట మురుగ దాసు 94445 90009
కోడంబాక్కం మురుగేషన్ 94445 90010
వలసరవాక్కం ఉమాపతి 94445 90011
ఆలందూరు పీఎఎస్ శ్రీనివాసన్ 94445 90012
అడయార్ పీవీ శ్రీనివాసన్ 94445 90013
పెరుంగుడి కరుణాకరన్ 94445 90014
షోళింగనల్లూరు రాజశేఖరన్ 94445 90015
హెల్ప్‌లైన్ నంబర్లు
కార్పొరేషన్ కంట్రోల్ రూం –1913
స్టేట్ కంట్రోల్ రూం –1070