
మేయర్ ఇంటికి బాంబు బెదిరింపు
● కోవైలో కలకలం ● కార్పొరేషన్ ఉద్యోగి అరెస్టు
సేలం: బిడ్డతో భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో మేయర్ ఇంటికి బాంబు బెదిరింపు ఇచ్చిన కోవై కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోయంబత్తూరు మున్సిపల్ పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ కంట్రోల్ రూమ్ పని చేస్తోంది. శనివారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి కోయంబత్తూరు ఆర్.ఎస్. పురంలోని కార్పొరేషన్ మేయర్ ఇంటి వద్ద బాంబు ఉందని, రాత్రి 10 గంటలకు బాంబు పేలుతుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళం హుటాహుటిన కోవై మేయర్ ఆర్.రంగనాయకి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. పేలుడు పరికరాలను ఉపయోగించి ఇంట్లోని అన్ని ప్రాంతాలలో సోదాలు కూడా నిర్వహించారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అది కేవలం బూటకమని తేలింది.
భార్య పుట్టింటికి వెళ్లిందని
పోలీసుల విచారణలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి కౌండంపాలయంలోని ప్రభు నగర్‌లోని టమాటా మార్కె ట్ ప్రాంతానికి చెందిన ఆనంద్ (40) అని తేలింది. అనంతరం పోలీసులు ఆనంద్ వద్ద జరిపిన విచారణలో తిరుపూర్‌కు చెందిన తాను కోవై కార్పొరేషన్‌లో ప్లంబర్‌గా పని చేస్తున్నట్టు తెలిపాడు. ఆరు నెలల క్రితం కుటుంబ సమస్య కారణంగా తన భార్య బిడ్డతో పాటు పుట్టింటికి వెళ్లిందని, ఎన్ని సార్లు బతిమాలినా ఆమెను తల్లిదండ్రులు కాపురానికి పంపించడం లేదని ఆవేదన తెలిపారు. ఈ విషయంపై ఆన్‌లైన్‌లో పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను మేయర్ ఇంటికి బాంబు బెదిరింపు ఇచ్చినట్టు తెలిపాడు. తర్వాత పోలీసులు ఆనంద్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.