
స్వదేశానికి తరలిన పాకిస్తానీయులు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఉన్న 200 మంది పాకిస్తానీయులు వారి దేశానికి బయలుదేరి వెళ్లారు. వీరిలో ఎక్కువ శాతం మంది వైద్య వీసా తీసుకుని ఇక్కడి ఆస్పత్రులలో చికిత్స నిమిత్తం వచ్చి ప్రస్తుతం వెనుదిరిగారు. కశ్మీర్‌లోని పహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై కేంద్రం కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఉన్న పాకిస్తానీయులు అందరూ వారిదేశానికి వెళ్లి పోవాలన్న హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తమిళనాడులో ఎక్కడెక్కడ పాకిస్తానీయులు ఉన్నారో అని ప్రత్యేక బృందం ద్వారా అధికార వర్గాలు ఆరా తీశారు. చైన్నె, కోయంబత్తూరు, వేలూరులలో వైద్య చికిత్సల నిమిత్తం వచ్చిన వారు అనేక మంది ఉన్నట్టు వెలుగు చూసింది. రోగులు, వారికి సహ కారంగా ఉన్న వాళ్లు అంటూ మొత్తంగా 150 మందికి పైగా గుర్తించారు. అలాగే వివిధ సంస్థల్లో ఉన్న పాకిస్తానీయులు సమారు 50 మందిని గుర్తించారు. వీరందర్నీ ఖాళీ చేయాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో వీరంతా వారి దేశానికి తిరిగి వెళ్లి పోయారు. సోమవారం పాకిస్తానీయులు ఎవరైనా ఇంకా ఉన్నారా? అని ప్రైవేటు ఆస్పత్రులలో పోలీసులు ఆరాతీశారు. ఆస్పత్రలలో రోగులుగా ఉన్నవాళ్లంతా డిశ్చార్జ్ చేసుకుని వెళ్లి పోయారు. కొందరికి వారి వారి చికిత్సలకు సంబంధించిన మాత్రలు, మందులను వైద్యులు ఇచ్చి పంపించేశారు. కొందరు శస్త్ర చికిత్సల కోసం ఇక్కడ ఉన్నా, చివరకు వెనుదిరగక తప్పలేదు.
వేసవి సెలవుల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలి
తిరువొత్తియూరు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్.కన్నప్పన్ జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులకు సోమవారం సర్క్యులర్ పంపారు. అందులో తమిళనాడులో, విద్యార్థుల కోసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ పథకం కింద, జూన్ 2024–25 విద్యా సంవత్సరం నుంచి, అన్ని పాఠశాలల్లో పుట్టినప్పటి నుంచి 17 ఏళ్ల వయసున్న విద్యార్థులకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులిచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయకుంటే, వేసవి సెలవుల్లో విద్యార్థులకు సమీపంలో ఉన్న ఈ–సేవా కేంద్రాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా, తపాలా కార్యాలయాలు, ప్రాంతీయ సేవా కేంద్రాలలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలలో ఆధార్–బయోమెట్రిక్ పునరుద్ధరణను నిర్వహించడానికి తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇది కాకుండా, కొత్తగా చేరిన విద్యార్థులను పాఠశాలలో చేరే సమయంలో, బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోడానికి సూచనలు ఇవ్వాలని, ఈ పనులను పూర్తి చేయమని చెప్పడం ద్వారా, సంక్షేమ సహాయం అందజేయడం వంటి పనులు జాప్యం లేకుండా జరిగేలా చూసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు ఇవ్వాలని కోరారు.
వారసుడికి పదవి?
●విజయ ప్రభాకరన్‌కు యువజన విభాగం పగ్గాలు
సాక్షి, చైన్నె: డీఎండీకే దివంగత నేత విజయకాంత్, ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ దంపతుల కుమారుడు విజయ ప్రభాకరన్‌కు పార్టీ పరంగా కీలక పదవి అప్పగించనున్నారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆయనకు అప్పగించేందుకు ప్రేమలత విజయకాంత్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. కరుప్పు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్), కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవనటుడు)గా అశేషాభిమానుల హృదయాలలో విజయ్‌రాజ్ నాయుడు అలియాస్ విజయకాంత్ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. వెండి తెర మీదే కాదు, రాజకీయాలలోనూ రాణించే సమయంలో అనారోగ్య సమస్యలు ఆయన్ను ముందుకు సాగనివ్వకుండా చేశాయి. ఏడాదిన్నర క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఆ పార్టీకి అన్ని తానై కేడర్‌కు అండగా ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ నిలబడ్డారు. లోక్‌సభ ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమితో కలిసి పోటీ చేసినా ఓటమిత ప్పలేదు. విజయకాంత్ కంటూ ఒక సైన్యం తమిళనాట ఉండటంతో వారిని రక్షించుకునే దిశగా ప్రేమలత వ్యూహాలకు పదును పెట్టారు. ఇంత కాలం పార్టీలో ఎలాంటి పదవీ అన్నది లేకుండా సేవలు అందిస్తూ వస్తున్న విజయకాంత్ వారసుడు విజయ ప్రభాకరన్‌ను పూర్తి స్థాయిలో పార్టీ పరంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కు యువజన ప్రధాన కార్యదర్శి పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బుధవారం జరిగే డీఎండీకే సర్వ సభ్యసమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించి విజయప్రభాకరన్‌కు యువజన విభాగం బాధ్యతలు అప్పగించ బోతున్నట్టు నేతలు పేర్కొంటున్నారు. కాగా, గత ఏడాది జరిగిన లోక్ సభఎన్నికలలో విజయకాంత్‌వారసుడు విజయ ప్రభాకరన్ విరుదునగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే.