
సామాజిక మాధ్యమాలపై గురి
● 464 ఖాతాల సీజ్
సాక్షి, చైన్నె : సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుని రాష్ట్రంలో రీల్స్ పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారి భరతం పట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న 464 మంది ఖాతాలను సీజ్ చేశారు. కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం, సామాజిక వర్గంపేరిట రీల్స్ విడుదల చేస్తూ, కొందరు అదే పనిగా రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై ఉండడం వివాదాలకు దారి తీస్తూ వస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడుపెంచారు. ఆ దిశగా తమిళనాడులో 464 మంది ఖాతాలను బ్లాక్ చేశారు. ఇందులో 252 ఇన్‌స్ట్రాగామ్ పేజిలు ఉన్నాయి.169 ఫేస్‌బుక్, ఏడు ఎక్స్ పేజీలు కూడా ఉన్నాయ. వీరంతా ఇష్టం వచ్చిన అభిప్రాయాలను వ్యక్తంచేయడం, చర్చలకు దారితీసే పరిణామాలు సృష్టిస్తూ రావడంతో వీరందరి ఖాతాలను బ్లాక్ చేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. చైన్నెలోని వంద మందికి చెందిన ఖాతాలను బ్లాక్ చేశారు. ఇదిలా ఉండగా, గత ఏడాది కాలంగా చైన్నెలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారిలో 11.44 లక్షల కేసులు నమోదు చేసిన రూ. 8.28 కోట్లను జరీమాన రూపంలో వసూళ్లు చేశారు. అలాగే సైబర్ నేర గాళ్లు గత ఏడాది కాలంలో ప్రజల నుంచి రూ. 1674 కోట్లు అపహరించి ఉన్నట్టు పరిశీలనలో వెలుగు చూసింది. ఇక ఉత్తర చైన్నెలో పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి రూ. 26.66 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు కానుంది.