
హన్సిక బాటలో శ్రీలీల
తమిళసినిమా: అనతి కాలంలోనే కథానాయకిగా అత్యున్నత స్థాయికి చేరుకున్న నటి శ్రీలీల. చిత్రాంగధ అనే తెలుగు చిత్రంలో చిన పాత్రతో 2017లో పరిచయమైంది. ఆ తరువాత కన్నడంలో కిస్, భరాతే చిత్రాల్లో నటించింది. ఈ తరువాత 2021లో పెళ్లి సందడి అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ చిత్రం యావరేజ్‌గా ఆడింది. అయితే ఈ అమ్మడు మాత్రం బాగా పాపులర్ అయ్యింది. అయినప్పటికీ ఆ తరువాత వెంటనే మరో అవకాశం రాలేదు. అలా చిన్న గ్యాప్ తరువాత నటుడు రవితేజ సరసన నటించిన ధమాకా చిత్రం విజయం శ్రీలీల కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ చిత్రంలో రవితేజతో చేసిన మాస్ డాన్స్‌ను కుర్రకారు బాగా ఎంజాయ్ చేశారు. అంతే ఈమెకు అవకాశాలు వరుస కట్టాయి. మహేశ్‌బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించడంతో శ్రీలీల టాప్ హీరోయిన్ల పట్టికలో చేరిపోయ్యింది. తాజాగా రవితేజకు జంటగా రెండోసారి జత కట్టిన మాస్ జాతర త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా అఖిల్‌కు జంటగా లెనిన్ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా తమిళంలోకి పరాశక్తి చిత్రం ద్వారా నేరుగా ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆషీకీ 3 చిత్రంలో నటిస్తోంది. ఇలా కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నాయకిగా పేరు తెచ్చుకున్న శ్రీలీలలో మానవత్వం అనే మరో గుణం ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. డాక్టర్ వృత్తిని చదివి నటి అయిన ఈమె ఇటీవల ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకుంది. కాగా తాజాగా మరో చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ చిన్నారిని ముద్దాడుతున్న ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో గుండెలపై దండయాత్ర చేయడానికి మా ఇంట్లో మరొకరు అని పేర్కొన్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అంతే కాదు ఈ బ్యూటీ మానవత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు. కాగా నటి హన్సిక కూడా ఇదే విధంగా తన పత్రి పుట్టిన రోజుకు ఒక అనాథ చిన్నారి లెక్కన ఇప్పుటికే 33 మంది అనాథలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అలా శ్రీలీల కూడా నటి హన్సిక బాటలో నడుస్తోందనిపిస్తోంది.