
ధరణి వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరిగింది
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నూతనకల్‌లో భూభారతి అవగాహన సదస్సు
నూతనకల్: రాష్ట్రంలో వివాద రహిత భూ విధానం తేవాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దొర పాలనలో రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ధరణి పోర్టల్‌ను తెచ్చారని ఆరోపించారు.
ధరణి వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఎంతో మంది తమ భూములు పట్టా కాకపోవడంతో ఇబ్బందులు పడి కోర్టుల చుట్టూ తిరిగారని చెప్పారు. ధరణి కష్టాలను తొలగించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి భూ భారతి చట్టాన్ని తెచ్చామని వివరించారు.
నిషేధిత జాబితాలోని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తాం
ధరణిలో తప్పిదాలు జరిగితే రెవెన్యూ అధికారులు వాటిని సరిచేయడానికి కూడా అధికారం లేకుండా గత పాలకులు చట్టాలు చేశారని పొంగులేటి ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్నకు లాభం చేయడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. కొత్తగా 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
కొత్తగా ఇచ్చే పాసు పుస్తకాల్లో సర్వే మ్యాప్ వివరాలు ఉంటాయని తెలిపారు. మండల స్థాయిలో ఏర్పడే సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వమే ఉచిత దరఖాస్తు ఫారాలను అందించి రైతుల పక్షపాతిగా నిలుస్తోందని తెలిపారు.
భూమికి హద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో ప్రతి రైతుకు భూధార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. సదస్సులో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె. నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్‌రావు తదితరులు పాల్గొన్నారు.