
సాక్షి,ఢిల్లీ: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్‌పై సోమవారం(డిసెంబర్ 9) విచారణ జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేసు విచారించింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు కోర్టు వాయిదా వేసింది.
ఆ రోజు తుది వాదనలు వినడంతో పాటు ఫైనల్ ఆర్డర్ ఉంటుందని తెలిపింది. దాసోజు శ్రవణ్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఈ కేసులో స్టే ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకువచ్చారు.
కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ను నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ చీఫ్ కోదండరాం సహా ఇతరులను పెద్దల సభకు పంపించింది.దీంతో శ్రవణ్ తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు.