‘సీతారామ’కు సరికొత్త సవాళ్లు | Construction Defects Revealed During Trial Run in Sitarama Project | Sakshi
Sakshi News home page

‘సీతారామ’కు సరికొత్త సవాళ్లు

Published Tue, Apr 15 2025 5:58 AM | Last Updated on Tue, Apr 15 2025 5:58 AM

Construction Defects Revealed During Trial Run in Sitarama Project

కుప్పకూలిన పాసేజ్‌ పిల్లర్‌

ట్రయల్‌ రన్‌కే బయటపడిన నిర్మాణ లోపాలు 

ములకలపల్లి మండలంలో కూలిపోయిన సూపర్‌ పాసేజ్‌ పిల్లర్‌ 

అంతకుముందు వానాకాలంలో ప్రధాన కాల్వకు రెండుచోట్ల గండ్లు 

ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై సందేహాలు 

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో నీటి సరఫరాపై అనుమానాలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కైనా గోదావరి జలాలు పొలాలకు పారుతాయా లేదా అనే సందే హాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గతంలోనే గండ్లు పడగా, ఇటీవల నిర్వహించిన ట్రయల్‌ రన్‌ సందర్భంగా.. ప్రధాన కాల్వ నిర్మాణంలో భాగమైన ఓ సూపర్‌ పాసేజ్‌ (బ్రిడ్జి) పిల్లర్‌ కూలిపోవడం సమస్యగా పరిణమించింది. 

9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టులో భాగంగా రూ.6,714 కోట్ల వ్యయంతో 104.4 కి.మీ. పొడవైన ప్రధాన కాలువ నిర్మించారు. దీని నీటి ప్రవాహ సామర్థ్యం 9,000 క్యూసెక్కులు. ఈ కాలువ దారిలో కిన్నెరసాని, ముర్రేడు వంటి నదులు, వాగులతో పాటు చిన్న చిన్న ఒర్రెల వంటి నీటి ప్రవాహాలు ఎదురైన చోట అక్విడెక్టులు, సూపర్‌ పాసేజ్‌లు నిర్మించారు. 

2018లో ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే 2022 చివరి నాటికి మూడు పంప్‌హౌస్‌లు, ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయింది. గతేడాది ఆగస్టులో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంప్‌హౌస్‌లు ప్రారంభించారు. తాజాగా 2025 మార్చి 3న ట్రయల్‌ రన్‌ నిర్వహించి గోదావరి నుంచి 405 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల ద్వారా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు అందించారు. అప్పటికే గోదావరిలో నీరు అడుగంటి పోవడంతో రెండు రోజులకు మించి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాలేదు. 

405 క్యూసెక్కులకే కూలిన సూపర్‌ పాసేజ్‌ 
గత నెలలో విడుదల చేసిన నీటి ప్రవాహానికి ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి సమీపంలో ప్రధాన కాలువ వెంట 48.30 కి.మీ. దగ్గర సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన సూపర్‌ పాసేజ్‌కి సంబంధించిన పిల్లర్‌ కూలిపోయింది. మొత్తం నాలుగు పిల్లర్లలో ఒకటి కూలిపోగా.. కాలువ రివిట్‌మెంట్‌ కూడా దెబ్బతింది. 

9 వేల క్యూసెక్కుల ప్రవాహం వెళ్లేలా డిజైన్‌ చేసిన ప్రధాన కాలువలో కేవలం 405 క్యూసెక్కుల ప్రవాహానికే పాసేజ్‌ పిల్లర్‌ కూలిపోవడం చర్చనీయాంశమయ్యింది. నీటి ప్రవాహం కారణంగా పిల్లర్ల కింద మట్టి కొట్టుకుపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టుర్‌తో 15 రోజుల్లోగా రిపేర్లు చేయిస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు.  

తెరపైకి ఎస్కేప్‌ చానల్‌.. 
గతేడాది నిర్వహించిన ట్రయల్‌ రన్‌కు ముందు ప్రధాన కాలువను ఆసాంతం పరిశీలించగా మొదటి, రెండో పంప్‌హౌస్‌ల మధ్య రెండు, మూడు చోట్ల గండి పడిన విషయం వెలుగు చూసింది. అయితే వర్షపు నీరు నిలవడం వల్ల కాలువకు తామే గండ్లు కొట్టామంటూ ఇరిగేషన్‌ అధికారులు ప్రకటించారు. అయితే గత ఆగస్టు 15న పంప్‌హౌస్‌లు ప్రారంభించే సమయానికి ఆ గండ్లను పూడ్చేశారు. 

అయితే సెప్టెంబర్‌ 1న భారీ వర్షాలు కురవడంతో పాల్వంచ మండలం బండ్రుగొండ వద్ద గండి పడగా రెండురోజుల తర్వాత చండ్రుగొండ మండలంలో మరో గండి పడి పొలాలు నీట మునిగాయి. దీంతో కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాల కారణంగానే గండ్లు పడుతున్నాయనే విమర్శలు వచ్చాయి. కాగా ప్రధాన కాలువలోకి వచ్చే అదనపు నీటి ప్రవాహాలను బయటకు పంపేందుకు కొత్తగా రూ.60 కోట్ల వ్యయంతో ఎస్కేప్‌ చానల్‌ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. 

ఖరీఫ్‌లో నీరు పారేనా ? 
గత ఖరీఫ్‌లో గోదావరి నీటిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు ఇవ్వాలని భావించినా..వర్షాల కారణంగా ఆ అవసరం పడలేదు. ఈ రబీ సీజన్‌కు ఎత్తిపోతలు మొదలెట్టినా గోదావరిలో సరిపడా నీరు లేక మధ్యలోనే ఆగిపోయింది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో కచ్చితంగా గోదావరి జలాలు పొలాలకు పారుతాయనే అంచనాలు నెలకొనగా కీలకమైన ప్రధాన కాలువలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో వాటిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు పూర్తి స్థాయిలో నీటిని వదిలే ముందు ప్రధాన కాలువ పటిష్టతను పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement